జమిలి ఎన్నికలపైన కోవింద్ కమిటీ నివేదికకు మోడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశానికి ఇప్పుడు జమిలి ఎన్నికలే తక్షణ అవసరమా? పదేపదే ఎన్నికలు ఖజానా మీద భారం మోపుతున్నా యని వీటిని సమర్ధించేవారు అంటున్నారు. పదేపదే ఎన్నికల వల్ల అభివృద్ధిమీద, పాలనమీద ప్రభుత్వ కేంద్రీకరణకు ఆటంకాలు ఏర్పడుతు న్నాయని వీరి వాదన. నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులున్నప్పుడే జమిలి ఎన్నికలు జరి గాయి కదా! ఇప్పుడెందుకొద్దు అంటున్నారు. అనేక రాజకీయ పార్టీలు, అసోచామ్, సీఐఐ లాంటి పారిశ్రామికవేత్తల సంఘాలు, కొందరు మాజీ న్యాయమూర్తులు కూడా సమర్ధిస్తున్నారు కాబట్టి, జమిలి ఎన్నికలు సమర్ధనీయమే అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల విధానంలో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమ య్యాయనీ, అస్థిర పాలనకు కారణమవు తున్నాయంటున్నారు. మోడీకి అనుకూల సమయంలో కోవింద్ కమిటీ రిపోర్టును తెప్పించుకున్నారనీ, క్యాబినెట్ ఆమో దం పొందారని జమిలి ఎన్నికలను వ్యతిరేకించే కొంతమంది వాదన. మోడీ పాలన స్థిరపరచు కునేందుకే ఈ ప్రయత్నమంతా అని వారి ఆరోపణ. ప్రతిపక్షం పాలించే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, కేంద్రం పట్టు బిగించేందుకు అవకాశాలు మరింత పెరుగుతా యనేది వీరి అభిప్రాయం. నిజానికి నివేదిక ఎప్పుడొచ్చింది, ఎప్పుడు ఆమోదించారన్నది ముఖ్యం కాదు. ఇది ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు. మోడీ లేదా బీజేపీ పాలన స్థిరపర చుకోవాలన్న లక్ష్యం మాత్రమే కూడా కారణం కాదు. వీటన్నింటికన్నా లోతైన సమస్య. భారతదేశ రాజ్యాంగం మౌలిక పునాదులనే కదిలించే సమస్య.
పదేపదే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానా మీద మోయలేని భారం పడుతుందన్న వాదన హాస్యాస్పదం. అధికారిక పరిమితిని మించి అనేకరెట్లు ఖర్చుపెడుతున్న వారే ఈ వాదన చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిపుష్టం చేయాల్సిన బాధ్యతను డబ్బుతో ముడిపెట్టడం సరైందా? ప్రజాస్వామ్య మూలాలు మింగుడు పడనివారే వీటిని ఖర్చుతో ముడిపెడతారు. స్వాతంత్రోద్యమ వారస త్వాన్ని అందిపుచ్చుకునేవారు ప్రజాస్వామ్యం మరింత బలపడాలని కోరుకుంటారు. ఖర్చు తగ్గుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఒక రాష్ట్రప్రభుత్వం ఐదేండ్లు పూర్తికాకుండానే తొందరగా పడిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉన్నది. కానీ ఈ ఎన్నిక జమిలి ఎన్నికలనాటి వరకే. ఐదేండ్ల కోసం కాదు. అంటే అదనంగా మరొకసారి ఎన్నికలు నిర్వహిం చడమే కదా! ఇప్పుడున్న పద్ధతి ప్రకారమైతే ఎన్నుకోబడిన నాటి నుండి ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగుతుంది. మధ్యలో మరో ఎన్నిక అవసరం ఉండదు. అంతేకాదు, కేంద్రం నిరంకుశత్వం గ్యారంటీగా పెరుగుతుంది. ప్రజలముందుకు పోవడానికి వీరు భయపడుతున్నారు. ప్రజానుకూల విధానాలు అమలు జరిపితే భయమెందుకు? పైగా పాలకులు ఒళ్లు దగ్గరపెట్టుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగ పడతాయి కదా! ఒకసారి ఎన్నికైతే ఐదేండ్లు అడిగేవారుండరన్న భరోసా ఏర్పడినప్పుడు ఈ పాలకులు ప్రజలను ఖాతరు చేయరు. పెట్టుబడి దారులకు, భూస్వాములకు అనుకూలంగా వ్యవహ రించదలచినప్పుడే ప్రజల ముందుకు పోవడానికి భయాలు. పారిశ్రామికవేత్తల సంఘాలు పదేపదే ఎన్నికలు నివారించాలనడంలో సారాంశం ఇదే కదా! ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాభిప్రాయానికి పరిమితులు విధించాలని కొన్ని పార్టీలు లేదా సంఘాలు, సంస్థలు, వ్యక్తులు చెబితే సరైందికాదు. అశేష ప్రజానీకానికి వీరు ప్రత్యామ్నాయం కాదు. రాచరికాల్లో, బ్రిటిష్ పాలనలో ప్రజాభిప్రాయానికి స్థానం లేదు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ప్రజాభిప్రాయానికి పరిమితులు విధించారు. ఇప్పుడు మోడీ పాలనలో ప్రజాభిప్రాయానికి మరిన్ని పరిమితులు విధించి రాజదండం స్పూర్తితో కొరడా ఝులిపించాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు కూడా ఇది ప్రత్యామ్నాయం కాదు. ఇప్పుడున్న ఫిరాయింపుల నిరోధక చట్టంలో పటిష్టమైన సవరణలు చేయవచ్చు. దామాషా ఎన్నికల పద్ధతికి సిద్ధపడితే ఫిరాయింపుల సమస్యే ఉత్పన్నం కాదు. వీటి ఊసెత్తడానికే పాలకులు సిద్ధంగా లేరు.
నెహ్రూ, అంబేద్కర్ లాంటి నేతలు ఉన్నప్పుడే జమిలి ఎన్నికలు జరిగాయన్న వాదనకు పసలేదు. ఇక్కడ సమస్య జమిలి ఎన్నికలు కాదు. సహజ క్రమంలో యాధృచ్ఛికంగా అన్ని ఎన్నికలు ఒకేసారి వస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. 1951-62 మధ్య జరిగిన ఎన్నికలు అట్లా జరిగినవే. కేంద్ర పాలకులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసారు. దాని ఫలితంగానే జమిలి ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది. ఆర్టికల్ 356ను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. గత కాంగ్రెస్ బాటలోనే కేంద్ర బీజేపీ సర్కార్ కూడా 356వ అధికరణాన్ని దుర్వినియోగం చేయడం చూస్తూనే ఉన్నాం. యాధృ చ్ఛికంగా ఒకేసారి ఎన్నికలు వస్తే శాంతిభద్రతల సమస్యలు, పోలీసు బలగాల అందుబాటు, తగినంత ప్రభుత్వ యంత్రాంగం లాంటి ఆచరణ సమస్యలే తప్ప, విధానపరమైన ఇబ్బందులు ఉండవు. ఒకేసారి ఎన్నికల కోసం రాజ్యాంగాన్ని సవరించడం, చట్టం చేయడమే ప్రమాదం. రాజ్యాంగాన్ని సవరిస్తే జమిలి ఎన్నికల కోసం కొన్ని శాసనసభల కాలం పూర్తికా కుండానే రద్దు చేయాలి. మరికొన్ని శాసనసభల కాల పరిమితిని పొడిగించాలి. ఈ రెండూ అప్రజాస్వా మికమే. పొడిగించే బదులు గవర్నర్ లేదా రాష్ట్రపతి పాలన విధించడం మరింత అప్రజా స్వామికం. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయడమే. రాష్ట్రాల హక్కులను, అధికారాలను తృణీకరించడమే. ఐదేండ్లు పూర్తికాకుండానే ప్రభుత్వం కూలిపోతే మిగిలిన కాలానికి గవర్నర్ లేదా రాష్ట్రపతి పాలన కూడా అప్రజాస్వామికమే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం అసెంబ్లీని రద్దుచేసి మరోసారి ప్రజాభిప్రాయం కోరే అవకాశం ఉండదు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి, ప్రత్యామ్నాయానికి అవకాశం లేనప్పుడు మళ్లీ ప్రజాతీర్పును కోరే అవకాశం కూడా లేదు. పైగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేవారు ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా జోడించాలంటున్నారు. అంటే, అప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని తొలగించే హక్కును హరించడమే. ఉన్న ప్రభుత్వాన్ని తొలగించే హక్కును ప్రత్యామ్నాయ సూచనకు లోబడి అమలు చేయాలనడం అప్రజాస్వామికం. పార్లమెంట్ విషయంలో కూడా ఇవే ప్రశ్నలు తలెత్తుతాయి. ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే రాష్ట్రపతి పాలన విధించినా లేక మైనారిటీ ప్రభుత్వమే ఐదేండ్లు పూర్తయ్యేదాకా పరిపాలించాలన్నా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. గవర్నర్ లేదా రాష్ట్రపతి పాలన ద్వారా రాష్ట్రాల మీద కేంద్రం పట్టుబిగించడం ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం. మన రాజ్యాంగం పీఠిక ”భారతదేశ ప్రజలమైన మేము” అని ప్రారంభమవుతుంది. అంటే, ప్రజాభిప్రాయమే మన రాజ్యాంగం పునాది. ప్రజలే అంతిమ నిర్ణేతలు. జమిలి ఎన్నికల పేరుతో మన రాజ్యాంగంలోని ఈ పునాదులనే పెకిలించేం దుకు ప్రయత్నిస్తున్నారు.
భిన్నమైన భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతుల సమాహారమే ఈ దేశం. వీరి సంస్కృతి, సంప్రదాయాలను గౌర విస్తూ వీరందరి ప్రయోజనాలను కాపాడ గలిగినప్పుడే ఒకే దేశంగా మనగలుగుతాము. లేనట్టయితే దేశ సమగ్రతకు, సమైక్యతకే ముప్పు ఏర్పడ వచ్చు. సువిశాలమైన భారతదేశంలో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. అందుకు తగిన ప్రణాళికలు అవసరమ వుతాయి. వివిధ ప్రాంతాల ప్రయోజనాలు, ప్రాధాన్యతలు వేర్వేరు గా ఉంటాయి. ఈ వైవిధ్యాన్ని గుర్తించ కుండా కేంద్రం పెత్తనం చేస్తే ప్రజలు అంగీకరించరు. బలవంతంగా అమలు చేయడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. రవీంద్రుడు రచించిన జాతీయ గీతం స్ఫూర్తిని నీరుగార్చడమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ఎన్నిక, ఒకే సంస్కృతి పేరుతో చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడానికి, నియంతృత్వాన్ని స్థిరపర్చడం కోసమే.
జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ఏక పక్షంగానే సాగుతున్నది. కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకే ప్రక్రియ ప్రారంభించామనడం మోసపూరితం. జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ముందుగానే నిర్ణయానికి వచ్చారు. కేవలం వాటి అమలుకు అవసరమైన పాలనాపరమైన, న్యాయ పరమైన అంశాలను పరిశీలించే బాధ్యత మాత్రమే కోవింద్ కమిటీకి అప్పగించారు. మోడీ ఏకపక్షంగా పోజాలడని, ప్రాంతీయ పార్టీలు మోడీని కట్టడి చేస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఈ టీడీపీ, జనసేనలాంటి పార్టీలు కేంద్రంతో లాలూచీకే ప్రాధాన్యత నిచ్చాయి తప్ప, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడలేదు. మంత్రి వర్గం ఆమోదం కూడా పొందిన నేపధ్యంలో ఇక ప్రజలు చేయ గలిగిందేమీ లేదా? కేంద్ర నియంతృత్వ పోకడలను భరించాల్సిందేనా? కానేకాదు. ఈ నిర్ణయాన్ని సగం రాష్ట్రాల శాసన సభలు ఆమోదిం చాలి. పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీ తో అంగీకరించాలి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఈ కాలాన్ని ప్రజలు, ప్రజా తంత్ర వాదులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు సంఘటితం కావాలి. కేంద్ర పాలకులను నిలదీయాలి. ప్రతిపాదనను ఉపసంహరించుకునేంత వరకూ పోరాడాలి.
– ఎస్. వీరయ్య