జమిలి పాట… రాజ్యాంగానికి పోటు

జమిలి పాట... రాజ్యాంగానికి పోటుపార్లమెంటు ఉభయసభలూ ప్రస్తుతం అతి కీలకమైన రెండు అంశాలను చర్చకు తలపెట్టాయి. ఇందులో ఒకటి నడుస్తుండగా మరొకటి నిర్ణయం కావలసి వుంది. ఇంకొకటి మోడీ ప్రభుత్వం సోమవారం బిల్లురూపంలో తీసుకు రానున్నది. నిజానికి ఈ మూడు పరస్పర సంబంధం లేనివేమీ కాదు. నేడు,రేపు తీసుకుకొస్తామంటున్న మార్పులు, చేర్పులు గానీ రాజ్యాంగ మూలస్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనవి. వాటిని జనంతో మింగించేందుకే ఏవో వేడుకలు, ఉత్సవాలు, చర్చలు అంటూ మాయనాటకం నడిపిస్తున్నారు. అదానీకి సంబంధించిన ఆరోపణలతో సహా పలు కీలకాంశాలు దాటవేసేందుకు కూడా ఈ ప్రహసనం తీసుకొచ్చారని చెప్పాలి. మోడీ హయాంలో రాజ్యాంగంపై దాడి గురించి తీవ్ర విమర్శలు వచ్చాయి గనకే ఈ సారి ప్రమాణస్వీకారం తరుణంలో దానికి నమస్కార నాటకంతో ప్రారంభించారు. పార్లమెంటు గోడలపై మాత్రం రాజ్యాంగంలో ఎక్కడా చెప్పని సెంగాల్‌ను ప్రతిష్టించారు.ప్రభుత్వం తరపున లోక్‌సభలో చర్చలో పాల్గొన్న సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యాంగంలో నిబంధన లను గురించి గాక ఏకగ్రీంగా ప్రకటించిన రాజ్యాంగ ప్రతిని ప్రశ్నిం చడంతో మొదలు పెట్టారు.రాముడు సీత విగ్రహాలతో ఏవో మతచిహ్నాలు వుంటేవాటిని లేకుండా చేశారని ఆరెస్సెస్‌ చిరకాల ఆరోపణలు సభలో వల్లెవేశారు.రాజ్యాంగ నిర్మాతలు కోవిదులైన వారిని గౌరవించకపోగా దాంట్లో భారతీయత ఏమాత్రం లేదని తిట్టిపోసిన ఆరెస్సెస్‌ భావ ప్రవక్తలైన వినాయక దామోదర సావర్కార్‌, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడైన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వంటివారి పేర్లు జపించారు. మత రాజకీయాలను ఆనాడే తిరస్కరించిన భగత్‌సింగ్‌ను తమ ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఇందిరాగాంధీ కుటుంబాన్ని విమర్శించే పేరిట నాటి కాంగ్రెస్‌ నాయక త్వాన్ని స్వాతంత్య్ర పోరాట విలువలను తిరస్కరించే బీజేపీ-ఆరెస్సెస్‌ బాణీయే ఈ చర్చలో అడుగడుగునా గోచరిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్‌,ఎస్పీ, సీపీఐ(ఎం) తదితర పార్టీలు ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు హాని కలుగుతున్న తీరును ప్రస్తావిస్తే వారికి మహా కంటగింపుగా వుంటున్నది. అడుగడుగునా అడ్డుతగులుతూ చర్చను రచ్చగా మారుస్తున్నది. కాంగ్రెస్‌ తరపున వయనాడ్‌ నుంచి ఎన్నికై వచ్చిన ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం కూడా ఈ అంశంపైనే కావడం విశేషం. మొత్తం చర్చకు ప్రధాని మోడీ సమాధానమిస్తారంటున్నారు గనక ఆయన ఏం సుభాషితాలు, ఎలా వుంటాయో వేచిచూడాల్సిందే.
జమిలి జుమ్లా
ఇప్పటికే కేంద్ర క్యాబినెట్‌ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపింది గనక సోమవారం నాడు న్యాయశాఖామంత్రి అర్జున్‌సింగ్‌ మేఘావాల్‌ దాన్ని సభలో ప్రవేశపెడతారని ప్రకటించారు.ఈలోగా వీలైన ప్రతిచోటా బీజేపీ- ఎన్‌డిఎ నాయకులు దానికి మద్దతు ప్రకటిస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు.తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జమిలిని బలపరుస్తున్నదని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు బిల్లు ఆమోదించినా 2029లోనే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన కొత్త సవరణ ప్రకటించారు. మరోవంక దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోని వైసీపీ మాత్రం రాజ్యాంగ కోణం కన్నా తమకు తొందరగా మళ్లీ ఎన్నికలు వస్తాయన్న ఆనందంతో పొంగిపోతున్నది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కూడా సూటిగా స్పందించకుండా మరింత స్పష్టత రావాలని చెబుతున్నది. కానీ వాస్తవానికి రేవంత్‌ సర్కారు గడువుకు ముందే తొలగిపోవాలనే హడావుడి వారిలో తొంగిచూస్తున్నది. ప్రాంతీయ పార్టీలుగా ఈ మూడూ సమాఖ్య విధానానికి, రాజ్యాంగ స్ఫూర్తికీ పూర్తి విరుద్ధమైన ఈ మార్పును గట్టిగా వ్యతిరేకించాల్సింది పోయి ఎన్నికలు రావడం మేలనే తాత్కాలిక దృష్టితో మాట్లాడటం దురదృష్టకరం. చంద్రబాబు బిల్లు ఆమోదించినా ఎన్నికలు రాబోవని నమ్మకంగా చెబుతున్నారంటే మోడీతీరు, ఆరెస్సెస్‌-బీజేపీ రాజకీయాలు ఆయనకు తెలి యవనా? ఎన్డీయేలో చేరేనాటికే వారి విధానాలు ఇలానే వుంటాయని చంద్రబాబు వంటివారికి బాగా తెలుసు. ఏమైనా అధికారం కోసం మోడీతో రాజీపడి ఆయన హుకుంలను ఆమోదించక తప్పదని తలవంచుతున్నారు. బీజేడీ, అకాలీదళ్‌, ఎఐడిఎంకె, లోక్‌జనశక్తి వంటివి బలపర్చాయని నివేదిక చెబుతున్నది. బీఆర్‌ఎస్‌, ముస్లింలీగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌,వైసీపీ, టీడీపీ వంటివి అధికారికంగా సమాధానమివ్వలేదట. డిఎంకె, ఆప్‌, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, బీఎస్పీ, ఎస్పీ వంటివి గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. చిన్నాపెద్ద కలిపి 32 పార్టీలు బలపరుస్తుంటే 15 వ్యతిరేకిస్తున్నాయని లెక్క చెబుతున్నారు. గతంలో కొంతబలపర్చిన పార్టీలు కూడా ఇప్పుడు వ్యతిరేక వైఖరి తీసుకున్నాయని, దీనిపై నివేదికను ఇచ్చిన కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడించారు.గురువారం నాడు ఈ నివేదికను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్‌ ఆ దిశలో ముందుకుపోవాలని నిర్ణయించింది. ఇందుకు సభలో ఎన్డీయే సంఖ్యాబలం సరిపోతుందా? అనేది ఒకటైతే రాజ్యాంగపరంగా ఇది చెల్లుతుందా? అనేది మరొకటి.
మాజీ రాష్ట్రపతి సేవలు
దేశానికి రాష్ట్రపతి అంటే రాజకీయ పార్టీలకతీతంగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినట్టు లెక్క. అలాంటి వారికి తదుపరి కాలంలో మరో బాధ్యత అప్పగించడం గతంలో ఎరగనిది. కానీ మోడీ సర్కారు మాజీ సిజెఐలతో పాటు రాష్ట్రపతులను కూడా రంగంలోకి దింపడం చూస్తున్నాం. 2023లో విడుదల చేసిన ఉన్నత స్థాయి కమిటీ నియామకం ఉత్తర్వు 11019/3/23లో కోవింద్‌కు జమిలి ఎన్నికల నిర్ణయం అమలును చర్చించమన్నారే గాని సిఫార్సు కోసం ఆ కమిటీని వేయలేదు. పైన చెప్పుకున్న రాజ్యాంగ నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకమైన నిర్ణయం.రాజ్యాంగం 75(3)అధికరణం లోక్‌సభ పదవీకాలాన్ని,164(1)శాసనసభల పదవీ కాలాన్ని విడివిడిగా పేర్కొంటున్నది. సభ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరునెలలకు మించి వుండరాదంటున్నది. 83(2) లోక్‌సభ విషయంలోనూ, 172(1)శాసనసభల విషయంలోనూ ఇతరేతరంగా రద్దు కాకపోతే మాత్రమే అయిదేళ్ల పదవీ కాలం అంటున్నాయి తప్ప కాలపరిమితి లేదు.వీటిలో దేనికి దానికి స్వంత అస్తిత్వం ఏర్పాటు ముగింపు రద్దు అవకాశాలున్నాయి.83వ అధికరణం లోక్‌సభ కాలపరమితిని, 85 రద్దు అవకాశాన్ని చెబితే 172వ అధికరణం శాసనసభ గడువునూ 174రద్దునూ చెబుతున్నాయి. రాష్ట్రాలకు అద నంగా 356 కింద రాష్ట్రపతి రద్దు చేసే మరో అధికరణం వుంది. ఆ తర్వాత ఆరుమాసాల లోపు మరోసభ సమావేశం కావాలని వుంది. దీని అర్థమేమి టంటే రాజ్యాంగ నిర్మాతలు కృత్రిమంగా సభలను పొడగించాలని గానీ, ప్రజల ఆమోదం లేకుండా పాలన నడిపించాలని గానీ ఎంతమాత్రం కోరు కోలేదు. పైగా 1967 వరకూ లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరిగాయంటే దానికి కారణం కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం వుండటమే.తర్వాత కాలంలోనూ ప్రతిపక్ష ప్రభుత్వాలను కేంద్రం నిరంకుశంగా రద్దుచేయడం వల్లనే రెంటికీ మధ్య అంతరం వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు, కూటములు అయిదేళ్లు తప్పక కొనసాగుతాయనే గ్యారంటీ వుందా?కానీ ఆ పేరిట కృత్రిమంగా పొడగించడం అంటే ప్రజల ఆమోదం లేని పాలన రుద్దడమే.
అంతా ఒకే పెత్తనమా?
ఒకే దఫా ఎన్నికల వల్ల రూ. 5వేల కోట్లు ఆదా అవుతాయని, జీడీపీ పెరుగుతుందని తాడూ బొంగరం లేని కథలు చెబుతున్నారేగానీ బాధ్యత లేని పాలన వల్ల ఎన్ని వేల కోట్లు దారితప్పుతాయో వేరే చెప్పాలా? ఒక చిన్నఇంట్లో అందరి పెండ్లిళ్లు, అందరి చదువులు ఒకేసారి జరగవు గానీ ఇంత పెద్ద దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలనడం ఏం తర్కం? ఏం ఇంగితం? కేంద్రంలో ప్రభుత్వాలు నాలుగుసార్లు కూల్చిపోయాయి. మరో రెండుసార్లు ముందే ప్రధాని ఎన్నికలకు వెళ్లారు. మరి ఇలాంటి సమయాల్లో అన్ని రాష్ట్రాల్లో అనవసరంగా సభల రద్దు ఖర్చు తగ్గిస్తుందా, పెంచుతుందా?ఈ దేశాన్ని రాష్ట్రాల కలయిక అని రాజ్యాంగం చెబుతుందే గానీ కేంద్రీకృత ఏకరూప అని చెప్పడం లేదే? ప్రపంచ బ్యాంకు లేదా అంతర్జాతీయ పెట్టుబడి చెప్పే ప్రపంచీకృత విధానాలు ఒకే విధంగా అమలు చేసే ఏకీకృత మార్కెట్‌గా రుద్దడం కోసమే దీనిపై ఇంత హడావుడి. అదే విధంగా ఏకరూప మెజార్టీ మతతత్వ నిరంకుశత్వంతో రాష్ట్రాలను మండలాల స్థానిక సంస్థల స్థాయికి దించే సంఘపరివార్‌ కుట్ర కూడా. అందుకే మలిదశలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఈ పరంపరలో కలపడమంటే అర్థం అదే. ఒకే పన్ను, ఒకే రేషన్‌, ఒకేచట్టం, ఒకే విద్య, ఒకే మతం, ఒకే బీజేపీ, ఒకే మోడీ అన్నదాని పరాకాష్ట. వీరు ఇది అధ్యక్ష తరహా పాలనను రుద్దే ప్రయాణంలాంటిదే. అలా రాజ్యాంగం రెండుసార్లు మార్చుకున్న శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాలు కూడా మళ్లీ వెనక్కు రావలసి వచ్చింది. ప్రపంచంలో భారత దేశంలా ఇన్ని భాషలు, విభిన్నతలు గల దేశాలు వే ళ ్లమీద లెక్కపెట్టదగినన్ని కూడా లేవు. అటు మార్కెట్‌, ఇటు మతతత్వం అవసరాల కోసం ఆరాటపడటమే గానీ చిన్నవీ పెద్దవీ కలిపితే 28 రాష్ట్రాలు గల ఈ దేశంలో ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. స్థిరత్వం జపం వాస్తవంలో మరింత అస్థిరతకూ మరింత ఆర్థిక భారానికి దారితీస్తుంది. 15 రాజ్యాంగ సవరణలు చేయాలి. రాష్ట్రాల్లోనూ ఆమోదించాలి. ఇందుకు లోక్‌సభలో 362 కావలసివుంటే 299 ఎంపీల మద్దతు మాత్రమే వుంది. ఎటూ చేరనివారు 19. ఇక రాజ్యసభలో 164 మంది మద్దతు కావాలంటే 125 బలం మాత్రమే వుంది.24 మందిది అటూ ఇటు కాని మధ్యే మార్గం. ఈ పొందికలో తుదిఫలితం ఏంటనేది ఒకటైతే రాష్ట్రాలలో చాలాచోట్ల ఎన్డీయే అధికారంలో లేదు.కనుక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం కూడా గగనమే. అందుకే పార్టీలను తిప్పుకునే పథకాలు, కుట్రలూ కూడా జరుగుతాయి.ఏమైనా రాష్ట్రాల హక్కలనూ ప్రజల ఎన్నుకునే హక్కును కూడా కాపాడుకోవడం ఇక్కడ కీలక సవాలు.
జగదీప్‌ ధంకర్‌
ఇక రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఈ పరిణామాల కొనసాగింపే. ఎందుకంటే రాజ్యసభ మౌలికంగా రాష్ట్రాల సభ.(రాజ్యం అంటేరాష్ట్రం)కానీ జగదీప్‌ ధంకర్‌ వచ్చాక రాజును మించిన రాజభక్తుడిలా మోడీని మించి ఆరెస్సెస్‌ను కీర్తించడం, ప్రతిపక్షాల పీకనొక్కడం నిత్యకృత్యమైంది.దీన్ని నిరసించిన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతివారితో వాదనలు పెట్టుకుని అవమానిస్తున్నారు. కనుకనే అనివార్యంగా ఆయనపై అవిశ్వాసం నోటీసునిచ్చాయి.దానిపైన కూడా తగాదా పెట్టుకోవడం ధంకర్‌కే చెల్లింది. అయితే ఆ తీర్మానాన్ని అనుమతిస్తారా లేక ఏవో సాకులతో నిరాకరిస్తారా? అనే సందేహాలున్నాయి. లౌకిక ప్రతిపక్షాలు మోడీ సర్కారు కుట్రలకూ, ఒత్తిళ్లకు తలవంచకుండా ఐక్యంగా నిలబడితే ఈ కుట్రలను ఛేదించడం సాధ్యమవు తుంది. ఏమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయంగా తీవ్రమవుతున్న ఘర్షణనే పార్లమెంటు ప్రతిబింబిస్తున్నదని చెప్పాలి.
తెలకపల్లి రవి