– రాష్ట్రంలో ఐదురోజుల పాటు సందర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) శ్రీనగర్ డిప్యూటీ డైరెక్టర్ తారిఖ్ రాథర్ నేతృత్వంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన 14 మంది మీడియా ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో ఆ బృందం పలు ప్రదేశాలను సందర్శించనున్నది. పర్యటనలో భాగంగా నేడు తొలిరోజు భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కోయిస్)ను సందర్శించింది. ఫిషింగ్ జోన్ల సామర్ధ్యంపై సలహాలు, తుపాను, ఉప్పెన, సునామీలపై ముందస్తు హెచ్చరికలు, సముద్ర స్థితిపై అంచనాలు, పగడపు దిబ్బల (కోరల్ బ్లీచింగ్)పై హెచ్చరికలు, ఆల్గల్ బ్లూమ్ సమాచార సేవలతో సహా ఇన్కోయిస్ అనేక సేవల గురించి బృంద సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిరంతర సముద్ర పరిశీలనలు, సమాచార నిర్వహణ, సముద్ర మోడలింగ్ (సముద్రంలో జరిగే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ,అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించే ఒక పద్ధతి)లో నిరంతర మెరుగుదల ద్వారా సమాజం, పరిశ్రమ, ప్రభుత్వం, శాస్త్రీయ సమాజం వంటి వివిధ రంగాలకు సముద్ర డేటా, సమాచారం, సలహా సేవలను తమ సంస్థ అందిస్తున్న తీరును ఇన్కోయిస్ డైరెక్టర్ డాక్టర్ తుమ్మల శ్రీనివాస కుమార్ ప్రతినిధి బృందానికి వివరించారు.
సునామీలు, తుపాను, ఉప్పెనలు వంటి విపత్కర పరిస్థితుల్లో సముద్ర సమాచారం, సలహా సేవలను అందించడంలో సంస్థ పాత్ర గురించి ఇన్కోయిస్ శాస్త్రవేత్త డి అజరు బృంద సభ్యులకు వివరించారు. తెలంగాణలో వివిధ భారత ప్రభుత్వ పథకాల అమలు ద్వారా జరుగుతున్న అభివృద్ధిని వీక్షించే అవకాశాన్ని జమ్మూకశ్మీర్ లోని మీడియాకు కల్పించేందుకు కేంద్ర రంగ పథకం ‘డెవలప్ మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ ‘ కింద పిఐబి, జమ్మూకశ్మీర్ ఈ టూర్‌ను నిర్వహిస్తోంది. అంతకుముందు, హైదరాబాద్‌లోని పీఐబీ కార్యాలయాన్ని ఆ బృందం సందర్శించింది. జమ్ముకాశ్మీర్ మీడియా ప్రతినిధి బందానికి అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ తెలంగాణలో సంస్థ పనితీరు గురించి వివరించారు. పీఐబీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, ఇతర అధికారులు మీడియా ప్రతినిధి బృందం వెంట ఉన్నారు.