ప్రజాస్వామ్య పథంలో జమ్మూకాశ్మీర్‌

Jammu and Kashmir on the road to democracyజమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం విరబూయాలని ఎవరికుండదు? మనదేశానికి మకుటాయ మానం. అతి సుందర నందన వనం. హిమోన్నత రాష్ట్రం. దశాబ్దాల తరబడి తుపాకుల హింసకు తలొగ్గుతూ రక్తమోడుతున్న ప్రాంతం. కనుకనే ఈసారి ఎన్నికలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. కనుకనే ఈ ఉత్సుకత.90 స్థానాలు ఉన్న జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీకి మూడు విడతలుగా ఎన్నికలు జరగను న్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో పోలింగ్‌ జరుగనుంది. అక్టోబరు 4 ఫలితాలు విడుదల. ఇప్పుడిక ఆ రాష్ట్ర ఓటరు ఎవరికి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.ఆర్టికల్‌ 370తో పాటు, 35-ఏను కూడా పునరుద్ధరి స్తామని అందులో స్పష్టం చేశారు. నిరంకుశంగా రూపొందించిన ‘ప్రజాభద్రత చట్టాన్ని’ రద్దు చేస్తామని, అలాగే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తామని తెలిపారు. అంతేకాకుండా జమ్మూ- కాశ్మీర్‌ విషయంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు సహకరిస్తామని కూడా చెప్పారు. ఇక ఏడాదికి 12 గ్యాస్‌ సిలిండర్‌లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి సంక్షేమ చర్యలు సరేసరి. వీటన్నిటితో పాటు కాశ్మీర్‌ పండిట్లకు పూర్వవైభవం, పాస్‌పోర్ట్‌ సౌకర్యం సులభతరం. యువతకు పెద్దఎత్తున ఉద్యోగ కల్పన అంశాలు ప్రకటించడం అందరినీ ఆకర్షిస్తున్నాయి.
కాగా మరోవైపు పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తొలిసారిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నది. అనంత నాగ్‌లోని బిజ్‌బెహరా నియోజక వర్గం నుంచి ఆమె పోటీకి సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఆమె తన తల్లి మెహబూబా ముఫ్తీకి మీడియా ప్రధాన సలహా దారు. 2019 ఆగస్టు 5వ తేదీ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ముఫ్తీని నిర్భందించడంతో ఇల్తీజా రాజకీయరంగ ప్రవేశం చేసింది. యువతకు, మహిళా లోకానికి ఆమె ఓ పెద్ద ఆకర్షణ. జమ్మూ కాశ్మీర్‌ లోని చాలామంది ముఖ్య నాయకులు నిర్భంధంలో ఉన్న విషయం తెలిసిందే. టెలివిజన్‌ చర్చల్లో ఆమె పాల్గొనే తీరు, విన్పించే గొంతుకకు గొప్ప ప్రజాదరణ ఉన్నది.
అయితే ప్రస్తుత బీజేపీకి మాత్రం పరిస్థితి ఎదురీతగానే ఉంటున్నది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి, లడక్‌ను ప్రత్యేక ప్రాంతంగా చీల్చి పక్కన పెట్టడం అక్కడ స్థానికులకు ఎవరికీ రుచించడం లేదు. ఉగ్ర వాదులు హింసాకాండను సమూలంగా అరికట్టేందుకే ఆర్టికల్స్‌ను రద్దుచేసి ఇలా విభజన చేసామన్న బీజేపీ వాదనను వారు మొదటినుంచీ అంగీకరించడం లేదు. ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. గత ఐదేండ్లలో ఉగ్రవాదుల ప్రభావం ఏమీ తగ్గలేదు సరికదా పాక్‌ ఐ.ఎస్‌.ఐ నాయకత్వంలోని ఉగ్రవాదానికి- భారతసైన్యానికి మధ్య నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మత విభజన లక్ష్యంతో బీజేపీ పైకి చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదు.
ఉదాహరణకు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉదంపూర్‌, జమ్మూ నియోజక వర్గాల్లో గెలిస్తే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శ్రీనగర్‌, అనంతనాగ్‌- రాజేరి నియోజకవర్గాల్లో గెలుపొందింది. కానీ కాశ్మీర్‌ విషయంలో తాముచేసింది చారిత్రక నిర్ణయంగా గొప్పలు చెప్పుకుంటున్నది బీజేపీ! కాగా, బారాముల్లాలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి రషీద్‌ గెలుపొందారు. ఒమర్‌ అబ్దుల్లాపై రెండు లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఆందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేయడమే కాదు, ఆందోళనకూ గురి చేస్తున్నది. కారణం రషీద్‌ కాశ్మీర్‌కు ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్‌ చేయడం. ఉగ్రవాదులకు రహస్య నిధులు అందజేస్తున్నారనే ఆరోపణ ఉన్నది. అసలు ఆ ఆరోపణపై అతన్ని జైలులో నిర్భంధించారు కూడా.ఈ తీవ్రధోరణి ఇలానే కొనసాగితే బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నంకాక మానదు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి పదిహేను సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 36 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఫలితంగా కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో, ముఫ్తీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఐదు స్థానాల్లో ఆధిక్యత పొందాయి. అంటే మొత్తం 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యతతో ఉన్నట్టు తెలుస్తోంది.బీజేపీ 29 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభించింది. ఆ పార్టీ గెలుచుకున్న రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పరిస్థితిని ముందుగా ఊహించింది కనుకనే బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో కాశ్మీరులో తమ పార్టీ ఆభ్యర్థిని నిలబెట్టలేదనే వాదన లేకపోలేదు.
ఇదిలా ఉండగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్‌.జీ) మనోజ్‌సిన్హా పాలనపట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగులుకుంటున్నది. మిలటరీ సాయంతో ఇష్టారా జ్యంగా వ్యవహరించే ఎల్‌.జీ పాలనకన్నా ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనే మిన్న అన్న సత్యం ప్రతి ఒక్కరికీ తెలుసు.’జమ్మూ- శ్రీనగర్‌లు ప్రభుత్వ ప్రకటనల్లో పేరుకు మాత్రమే స్మార్ట్‌ నగరాలుగా, పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయి. కానీ, మాకు మాత్రం మౌలిక వసతులు లేని దెబ్బ తిన్న వ్యాపార కేంద్రాలుగా కన్పిస్తాయని’ స్థానికులు వాపోతున్నారు. బయటనుండి వచ్చే కార్పోరేట్‌ దిగ్గజాలు అక్రమమైనింగ్‌, మద్యం, డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ తమ పత్రిష్ట దిగజారుస్తున్నారని అంటు న్నారు. ప్రభుత్వం వీటిపట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరించడం తమకు అన్యాయం చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘మాకు ఉద్యోగాలు లేవు. పెద్దఎత్తున మా ప్రాంతాలకు పెట్టుబడులు, ఉపాధి కల్పనా కేంద్రాలు రావలసి ఉంది,కానీ మేం ప్రశ్నిస్తే దేశద్రోహులమై పోతున్నాం’. అని తెలిపే యువత ఆక్రోశంలో ఎంతో నిజం ఉంది.
అందరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే గత 35 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా మొన్న లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో 58:58 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటింగ్‌ శాతం కచ్చితంగా పెరుగు తుందనే ఆశాభావంతో ప్రజలున్నారు. గతంలో ఎన్నికల బహిష్కరణవరకు వెళ్లిన ఈ రాష్ట్రం ఇప్పుడిలా ప్రజాస్వామ్య పథంలో అడుగిడటం, శాంతి సామరస్యాలు చిగురించడానికి సంకేతమే కదా!
కె. శాంతారావు
9959745723కె. శాంతారావు
9959745723