– శేరిలింగంపల్లి,కూకట్‌పల్లి సీట్లు ఇవ్వొద్దని ఆందోళన
– తమకు సీట్లు కేటాయించకపోవడంపె నేతల ఆగ్రహం
– ఈటల టార్గెట్‌గా అసమ్మతి రాగం తీవ్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో టికెట్ల లొల్లి ముదిరిపాకాన పడింది. పొత్తుల పంచాయతీ శ్రేణుల ఆగ్రహానికి కారణమవుతున్నది. జనసేనకు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలు కేటాయిస్తున్నారనే ప్రచారం కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి దారితీసింది. పవన్‌కళ్యాణ్ పార్టీకి తెలంగాణలో సీట్లు కేటాయింపు అంశం నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని నేతల ధిక్కారస్వరం రోజురోజుకీ పెరగటం కలవరపెడుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో టిక్కెట్లు దక్కని హార్డ్‌కోర్ బీజేపీ నేతలు ఈటలపై దుమ్మెత్తిపోస్తుండటం గమనార్హం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నేడు ఆందోళనల కేంద్రంగా మారింది. ఏ క్షణాన ఏ నాయకుడు ఏ రూపంలో నిరసనలు తెలుపుతాడో అర్థంకాక రాష్ట్ర నాయకత్వం సతమతం అవుతున్నది. వారికి సర్దిచెప్పలేక తలలు పట్టుకుంటున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, తదితర నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో అగ్గి రాజేసింది. జనసేనకు కూకట్ పల్లి టికెట్ కేటాయించవద్దని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్‌రెడ్డి రాష్ట్ర కార్యాలయంలోనే సోమవారం ఆందోళనకు దిగారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ఆ నియోజకవర్గం శ్రేణుల నినాదాలు మార్మోగిపోయాయి. బీజేపీలో టికెట్ ఆశిస్తున్న నలుగురిలో ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాంగానీ, జనసేనకు మాత్రం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. జనసేనకే ఇస్తే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరిస్తు న్నారు. శేరిలింగంపల్లి సీటును జనంలేని జనసేనకు ఏ ప్రాతిపదికన ఇస్తారంటూ బీజేపీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. నాయకత్వ తీరుతో క్యాడర్‌లో తీవ్ర అసహనం మొదలైంది. రవియాదవ్ నేతృత్వంలో ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేసిన విషయం విదితమే.
ఈటల టార్గెట్‌గా అసమ్మతి
ఈటల వర్సెస్ బండి గా సాగుతున్న ఆధిపత్యపోరు మరింత తీవ్రమైంది. ఈటల టార్గెట్‌గా అసమ్మతి గ్రూపు మరింత దూకుడు పెంచుతున్నది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఎర్రగొల్ల మురళీ యాదవ్‌ను ప్రకటించడం దీనికి ఆజ్యం పోసింది. ఆయన్ను కచ్చితంగా మార్చాల్సిందేనని టికెట్ ఆశించి భంగపడ్డ మరో నేత గోపి, అతని అనుచరులు రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవిని కూడా మార్చాలని ఆ నియోజకవర్గం బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. అక్కడ కొయ్యల ఏమాజి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. మూడో లిస్టులో టికెట్ ఆశిస్తున్న నాయకులు రాష్ట్ర నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి టికెట్లు దక్కకపోతే పరిస్థితి ఎటు దారితీస్తుందో అని నాయకత్వం దిగులుచెందుతున్నది.
పార్టీని హోల్‌సేల్‌గా అమ్మే కుట్ర : గోపి
‘రాష్ట్రంలో బీజేపీని హోల్‌సేల్‌గా అమ్మాలని ఈటల రాజేందర్ చూస్తున్నారు. ఆయన వచ్చాకే ఆధిపత్యపోరు మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని టికెట్లను తన అనుచరులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. కష్టపడి పనిచేసిన బండిని, ఆయన అనుచరులను పక్కన పెట్టేశారు. 30,40 మంది కీలక నేతలను పార్టీ చేరుస్తామని ఝుటా మాటలు చెప్పిన వారి మాటల్ని నమ్మి మాకు అన్యాయం చేయడం సరిగాదు. ఢిల్లీకెళ్లి ఫైరవీలు చేసి బండి సంజరుని పదవి నుంచి తొలగించినప్పుడు ఈటలకు బీసీ నినాదం గుర్తుకురాలేదా? పని చేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి దొంగలకు టికెట్లు ఇవ్వడమేంటి? నర్సాపూర్ టికెట్ ప్రకటించి పది రోజులు దాటినా ప్రచారం ఎందుకు మొదలు పెట్టలేదని అడిగితే..పైనుంచి అందాల్సినవి రాలేదని చెబుతున్నారు. అందాల్సినవేంటి?’ అని గోపి అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నేతలు డిసెంబర్ 3 తర్వాత పార్టీలో ఉంటారా? అని ప్రశ్నించారు. జాతీయ నాయకులు తమకు న్యాయం చేయాలనీ, బండి సంజరు లాంటి నేతలను, తమను కాపాడుకోవాలని కోరారు.