జన విజ్ఞాన వేదిక చెకుముకి వేడుకల నిర్వహణ

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు  హాజరవగా, ట్రస్మా పట్టణ అధ్యక్షులు ధర్మరాజు, పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, జి ఆర్ ఎమ్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు హాజరయ్యారు. తొలుత జన విజ్ఞాన వేదిక కన్వీనర్ చెలిమెల రాజేశ్వర్ మాట్లాడుతూ మన దైనందిక జీవితంలో సైన్స్ ప్రాధాన్యత ఎంతో ఉందని, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా జన జీవితంలో సైన్స్ ప్రాధాన్యతని తెలియజేస్తూ జనవిజ్ఞాన వేదిక ఎన్నో కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగిస్తూ వారికి ఎన్నో రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మాట్లాడుతూ, జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వాటి వల్ల సమాజానికి మేలుకొలుపు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని చక్కగా చదివి సమాజంలో సైంటిస్టులుగా, గొప్పవారుగా, ఎదిగి దేశానికి, మన రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ట్రస్మా పట్టణ అధ్యక్షులు ధర్మరాజు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి విద్యార్థుల్లో సామాజిక స్పృహ అలవాటు చేసుకోవాలని విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టుకొని జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరారు.పాఠశాల నిర్వాహకులు మోహన్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా ప్రణాళిక వేసుకొని కష్టపడినట్లయితే తప్పనిసరిగా అనుకున్న గమ్యాన్ని చేరగలరని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన చెకుముకి పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈరోజు ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మండలాల్లోని పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాన్ని, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 9, 10, 11వ తేదీల్లో జనగాం లో జరగబోయే రాష్ట్ర స్థాయి  పోటీలుంటాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ నవీపేట విద్యార్థులు పి. ధివిత్ గౌడ్, ఓ. రాకేష్, శ్రీనిధి లు ఎంపికవగా, ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం నుండి కే.జీ.బి.వి. ధర్పల్లి విద్యార్థులు బి. అరుణ, కే. వైష్ణవి, ఏ. శ్రీనిధి ఎంపికయ్యారు.ప్రైవేట్ పాఠశాలలు నుండి ప్రథమ బహుమతి పొందిన విక్టరీ హై స్కూల్ చందూరు విద్యార్థులు, బి. ఆశ్రిత, జి నాగ శ్రావణి, వై, నిత్య యాదవ్ లు‌ ఉన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు జిఆర్ఎం సొసైటీ ఆధ్వర్యంలో భోజన వితరణ జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సైన్స్ ప్రజెంటేషన్  “మిరాకిల్ ఎక్స్పోజర్” లో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీశైలం, అనూష ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.ఆక్స్ఫర్డ్ పాఠశాల హెడ్ మాస్టర్ వీ రమణ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.