బెర్లిన్ : గత సంవత్సరం చివరలో ఏర్పడిన మాంద్యంవల్ల జపాన్ తన మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయిందని గురువారంనాడు విడుదలైన అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. నామినల్ స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా చూస్తే ఆ స్థానాన్ని జర్మనీ ఆక్రమించింది. గత సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో జపాన్ స్థూల జాతీయోత్పత్తి 0.4శాతం కుదింపుకు గురైంది. అంతకు ముందు త్రైమాసికంలో 3.3శాతం పతనమైంది. అంతిమ త్రైమాసికం కంటే 1.4శాతం ఎక్కువగా పతనమవుతుందనే అంచనాల నడుమ జపాన్‌లో మాంద్యం నెలకొంది. సాంకేతికంగా రెండు త్రైమాసికాలలో వరుసగా ఒక ఆర్థిక వ్యవస్థ కుదింపుకు గురైతే మాంద్యం ప్రవేశించిందని చెబుతారు. నాలుగవ త్రైమాసికంలో ప్రయివేటు వినిమయం 0.9శాతం పతనం అయింది. కార్పొరేట్ పెట్టుబడి కూడా 0.3శాతం తగ్గింది. ఎగుమతులు 11శాతం పెరిగాయి. దిగుమతులు 7శాతం పెరిగాయి.
డాలర్లలో లెక్కించినప్పుడు 2023 చివరలో జపాన్ స్థూల జాతీయోత్పత్తి 4.2ట్రిల్లియన్లు ఉండగా, జర్మనీ స్థూల జాతీయోత్పత్తి 4.5 ట్రిల్లియన్లుగా ఉంది. అయితే పర్చేస్ పవర్ ప్యారిటీ (పీపీపీ) ఆధారంగా చేసే లెక్క మరోలా ఉంటుంది. దేశాల మధ్య వస్తువుల, సేవల విలువలలో తేడాలను సర్దుబాటు చేసి ఆర్థిక ఉత్పాదన, జీవన ప్రమాణాలను పోల్చే పద్ధతిని పర్చేస్ పవర్ ప్యారిటీ(పీపీపీ ) అంటారు. ప్రపంచ బ్యాంకు పర్చేస్ పవర్ ప్యారిటీ(పీపీపీ) ఆధారంగా చేసిన అంచనా ప్రకారం 2022లో చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంది. రెండవ స్థానంలో అమెరికా, ఆ తరువాత స్థానాలలో ఇండియా, జపాన్‌లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఐదవ స్థానంలో వున్న జర్మనీని రష్యా అధిగమించిందని చెబుతున్నారు.