‘ఓ రాజన్న తాత తిన్నవా’ అని మందలిచ్చుడు పాపమైంది. ‘మా ఇంట్ల బువ్వెక్కడిదిరా? పతాకం మంది కొంపలమీదవడి తినుడేనాయే’ అని వదురవట్టే… ‘పొద్దుగాల పొద్దుగాల గీ ముసలోని నోట్లె నోరు వెట్టుడు తప్పైందనుకుంటూ’ గా రచ్చబండతాన పోయేసరికి ఒకటే లొల్లి. ‘ఏంది… ఊరంతా గిట్ల జమైంది. బొడ్రాయి వెట్టి ఏడాది గూడ గాలేదు మల్ల వెడ్తరా ఏంది’ అనుకుంటూ దగ్గరికి వోయేసరికి.. మీ వాడోళ్లు జెయ్య వట్టే ఊర్ల నీళ్లగ్గోసచ్చిందని ఒకల్నొకలు తిట్టుకున్నంత పని చేస్తుండ్రు. గప్పుడు గా సర్పంచ్ బయటకచ్చి.. ఇగో గిట్ల లొల్లి వెట్టుకుంటే నేనే గాదు ఊర్ల పెద్ద మనుషులం ఎవ్వరం ఏం జెయ్యలేం. మేం జెప్పినట్టు ఇనుండ్రీ జెర. గీ ఏడాది నీళ్లకు గోసచ్చింది. ఊర్లున్న చెర్ల, కుంటల నీళ్లు దగ్గరవడ్డయి. గొడ్లకు, గోదలకు తాగడానికి కూడా సరిపోయేతట్టు లేవు. ఊర్ల బాయిలు, బోర్లన్ని ఎండి పోయినయి. ఊరు మొత్తంల రెండు వందల గడుపుంటే ఎనిమిది బాయిళ్లల్లనే నీళ్లున్నై. గా నీళ్లే ఎండ కాలమంత గావాలే. గందుకు గ్రామపంచాయతి తీర్మానం జేసింది. గీ మూన్నెళ్లు మనూళ్లే నీళ్లు పక్కూరోల్లకు ఇయ్యద్దు. రోజుకు మనిషికి రెండు బిందెల నీళ్లు తీసుకోవాలే. ఇంట్ల ఎంతమందుంటె అంత మందికి పొద్దుగాల బిందెడు, మాపటి జామున బిందెడు నీళ్లత్తై. ఒక్కో బాయికాడ ఒక్క మనిషినివెట్టి పంచుతం. గీ నీళ్లను పైలంగా వాడుకోండ్రీ అని జెప్పవట్టే. ‘ఓ మనిషి.. కాళ్లకట్టకు ఎండచ్చింది. ఇంకా ఎంతశేబ్బంటవు’ అంటూ మా పొల్ల లేపేసరికి తెలివైంది. అయ్యో గిదంతా కలేనా అనుకుంటూ జరిగిదంతా శెబితే నవ్వుద్దనుకున్నా. ‘ఆ… ఇంకో నెలాగరాదు. అదేఅయితది. నువ్వుగూడ బిందె వట్టుకోని లైన్ల నిలబడుడే’ అని కోపంగా అనేసరికి నోరెళ్ల వెట్టుడు నావంతైంది.
– ఊరగొండ మల్లేశం