ఇంటికంటే గుడి పదిలం అనేది నిన్నటి సామెత. ఇంటికంటే జైలు పదిలం అనేది తాజా కలం. అసలు ఈ ప్రపంచమే ఒక పెద్ద జైలు అని, మనిషి శరీరం అనే జైలులో ఆత్మ అనేది బందీ అయి వున్నదనే తాత్వికులూ లేకపోలేదు. ఎవరేం అన్నా మానవ లోకంలో జైలు పాపులారిటీ తక్కువదేం కాదు. అయితే జైలుకు వెళ్లిరావడం అంత ఈజీ విషయం మాత్రం కాదు. అది అందరికీ సంప్రాప్తించదు. చిన్నా చితకా చిల్లర మల్లర దొంగతనాల్లో జైలుకు వెళ్లడం చరిత్ర పుస్తకంలో పేజీ సంపాదించలేదు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినవారూ, కోట్లు కొల్లగొట్టినవారూ జైలుకు వెళ్తే అది చరిత్ర. వెళ్లి వచ్చాక అది ఘన చరిత్ర. ఒకప్పుడు జైలుకి వెళ్లి వచ్చినవాళ్లు దేశభక్తులు. ఇప్పుడు జైలుకి వెళ్లి వచ్చి, లక్కీఛాన్స్ కొడితే ముఖ్యమంత్రులు. జైలుకి వెళ్లిరావడం అంటే కలిసొచ్చే అదృష్టమన్నమాట. నడిచి వచ్చే నడమంత్రపుసిరి అన్నమాట.
అన్న ఎప్పుడు వస్తాడన్నా బైటికి అడిగాడు ఓ తమ్ముడు కాని తమ్ముడు అన్న కాని అన్నను. అన్నట్టు వాళ్లిద్దరూ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన అత్యంత విధేయులైన కార్యకర్తలు. వాళ్లున్నది ఎక్కడోకాదు జైలు గేటు ఎదుటే. వాళ్లిద్దరే కాదు అక్కడ అనేకమంది అన్నలు కాని అన్నలూ, తమ్ముళ్లు కాని తమ్ముళ్లూ వున్నారు. ఎప్పుడెప్పుడు తమ ప్రియతమ నాయకుడు జైల్లోనుంచి బయటకు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
లోపల ఉన్న అన్న మామూలు మనిషేం కాదు. గొప్ప పలుకుబడీ, పదవీ, హోదా వున్నవాడే. జనం నోళ్లు తెరిచి అబ్బా! అబ్బబ్బా! అనుకునే స్థాయి కుంభకోణం రచించినవాడే. కొన్ని నెలలుగా కోర్టులు, దర్యాప్తు సంస్థల మాటలతో దారి తప్పి అతన్ని అమాయకుడని, నోట్లో నాలికలేని వాడని, దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన దేశభక్తులకంటే గొప్ప దేశ భక్తుడని తెల్సుకోలేకోయాయి. అయితే కాలమూ, గడియారమూ, మనిషి ఆలోచనలు ఒక్కచోట కుదురుగా వుండవు కదా. నిన్నటి తప్పు నేడు ఒప్పు కావచ్చు కదా. అన్న ఇన్నాళ్లూ లెక్కపెడుతూ వచ్చిన ఊచల్నే మళ్లీ లెక్కపెట్టాల్సిన అవసరం లేకుండా బైట పడేరోజు రానే వచ్చింది.
అజ్ఞాత వాసం ముగిసి అన్న బయటకు వస్తే బాజాభజంత్రీలతో, డప్పు చప్పుళ్లతో, మంగళ వాయిద్యాలతో, శాస్త్రీయ అశాస్త్రీయ నృత్య విన్యాసాలతో, డిజిటల్ ధ్వనుల హోరుతో, ఆకాశంలోకి దూసుకువెళ్లి రంగురంగుల వెలుగు పూల వర్షం కురిపించే బాణా సంచాతో గౌరవంగా, భక్తిగా, ప్రేమగా, ‘అవసరం’గా ఒక పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకుపోవడానికి వచ్చారు కార్యకర్తలు, అభిమానులు, ఆసక్తి కలిగిన సామాన్యులు. రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసకట్టి నిలబడున్నాయి కార్లు.
అదిగో అన్న అన్నారెవరో. పోలోమంటూ పరుగెత్తారు జైలు వైపు జనం. చలో అంటూ తోసేశారు పోలీసులు. అన్న రాలేదు. ఎవడ్రా వచ్చిండన్నోడు అనరిచారెవరో. ఎక్స్ రౌడీ, ప్రస్తుత లీడర్. నేనే అన్నా అని ఎవడూ ముందుకు రాలేదు. ఎవరికి వారే నువ్వా అంటే నువ్వా అని గుసగుసలాడుకున్నారు.
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరగాలి కనుక అలాగే జరిగింది. అన్న బయటకి రానే వచ్చాడు. ఊచలు విసుగులేకుండా లెక్కపెట్టిన కుడిచెయ్యి పైకి ఎత్తి ఊపుతూ. జనం తొక్కిసలాడారు. చేయి పైకి ఎత్తి రెండు వేళ్లు చూపుతూ వచ్చిన అన్నకు జైజైలు కొట్టసాగారు. మామూలు శబ్దమా అది… కాదు, దిక్కులు గుండెలు అరచేతిలో పట్టుకుని ఏ దిక్కుకూ పారిపోలేక, ఉన్న దిక్కునే వుండిపోయినవి.
బయటకి వచ్చిన అన్న, చెయ్యి పైకి ఎత్తిన అన్న సింహధ్వానాలు, పులిగాండ్రింపులూ చేశాడు. పొలికేకలు పెట్టాడు. మహాభారత యుద్ధంలో గెలిచిన అర్జునుడు బంధుమిత్రులంతా పోయేరని బిక్కమొగం పెట్టివుంటాడు. కానీ అన్న మాత్రం పానిపట్టు యుద్ధం, ప్లాసీ యుద్ధం, హల్దీగాటు యుద్ధం గెలిచినవాడిలా ముఖాన్ని వేల వాల్టుల బల్బులా వెలిగించేశాడు. అన్న మెడ పూలదండలతో బరువెక్కిపోసాగింది. అన్న విజయయాత్ర ఆరంభమైంది.
అన్న అందరికీ కనపడాలి. అన్న చేయి అందరికీ ఊపాలి. అందుకే ఈ ఓపెన్ టాప్ జీప్. అన్నా ఎక్కు. నువ్వు అందరికీ కనపడాలె అన్నాడో కార్యకర్త. అన్న వెంటనే ఎక్కలేదు. ‘నేను జీప్ ఎక్కనే ఎక్క’ అన్నాడు. అదేందన్నా అన్నారు చుట్టూ వున్నవారు. ఇన్ని రోజులు జైలు ఊచలు లెక్కబెట్టి, ఇంత కష్టపడ్డది ఇందుకేనా? అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టి. జరగండి పక్కకు జరగండి. నాకు తెల్సు.. జైల్లో అంత కష్టపడిన అన్న ఎక్కాల్సింది జీబు కాదు ఏనుగు నాకు తెల్సు.. అందుకే తెప్పించిన అని ఓ భారీకాయుడు అంటుంటే, భారీకాయం చివర తొండం ఊపుతూ వచ్చి నిలబడింది గజరాజమనగా ఏనుగనగా ఎలిఫెంట్.
చూసిన్రా దేశభక్తి అంటే ఇది. నాలాగనే ఎవ్వరినన్నా అప్పోజిషన్ పార్టీలోల్లు జైల్లోపెట్టిస్తే ఇలాగనె ఏనుగు అంబారీ మీద ఊరేగించాలి అన్నాడు ఆనందం పట్టలేక అన్న. జయహో అని అరిచాడు సంతోషం తట్టుకోలేక. ఒక్క గొర్రె ‘మే’ అంటే అనేక గొర్రెలు ‘మే.. మే.. మే..’ అన్నట్టు జనం జయహో! జయహో! అని అరవసాగారు.
ఏనుగు ఎక్కి ఇంటికి వెళ్లిన అన్నయ్యకు అనేక గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అన్నకు దండ వేయడానికి, శాలువాలు కప్పడానికి, పాదాభివందనం చెయ్యడానికి మూడు వేరువేరు చేంతాళ్లంత క్యూల్లో నిలబడ్డారు జనం.
ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు చేసే సేవా కార్యక్రమాల్లో కొన్ని చిన్న పొరపాట్లు జరగచ్చు. ఓ వందో, వెయ్యో కోట్లు అటూ ఇటూ అవవచ్చు. అంత మాత్రం చేత గొప్ప నేతల్ని, పరిశుద్ధ పూసల్ని అన్యాయంగా జైలు పాలు చేస్తే చివరకు ఏం జరుగుతుంది? ఏనుగు అంబారీ ఊరేగింపే కదా! పరిజనం ఏమంటారు… జయహో! జయహో!! అనే కదా.
– చింతపట్ల సుదర్శన్
9299809212