– అజేయ శతకంతో చెలరేగిన యశస్వి
– రాణించిన శుభ్‌మన్, రజత్
– భారత్ తొలి ఇన్నింగ్స్ 336/6
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి రోజు
విశాఖ తీరంలో భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు. తొలి రోజు టీమ్ ఇండియా 336 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆరు వికెట్లు పడగొట్టింది. దీంతో తొలి రోజు ఆటలో పైచేయి ఎవరదనే సందేహం కలుగుతుంది. కానీ విశాఖలో ఇటు భారత్, అటు ఇంగ్లాండ్ కాకుండా.. తొలి రోజు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179 నాటౌట్) జైత్రయాత్ర సాగించాడు. 336 పరుగులు చేసినా బ్యాటింగ్ లైనప్‌ను కోల్పోయిన నిరాశలో భారత్ ఉండగా.. ఆరు వికెట్లు కూల్చినా జైస్వాల్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేదనే నైరాశ్యం ఇంగ్లాండ్ శిబిరంలో మిగిలింది. 22 ఏండ్ల యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. సహచర బ్యాటర్లు నిరాశపరిచినా మరో ఎండ్ నుంచి జైస్వాల్ దంచికొట్టాడు. ద్వి శతకం దిశగా దూసుకెళ్తున్న యశస్వి జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నేడు ఉదయం సెషన్లో ఆతిథ్య భారత్ 400 ప్లస్ స్కోరు ఆశిస్తుండగా.. ఇంగ్లాండ్ చివరి నాలుగు వికెట్లే లక్ష్యంగా చేసుకోనుంది.
నవతెలంగాణ-విశాఖపట్నం
యశస్వి జైస్వాల్ (179 బ్యాటింగ్, 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. విశాఖలో ఇంగ్లాండ్ బౌలర్లను దంచికొట్టిన యువ ఓపెనర్ టెస్టుల్లో కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ ఆల్ స్పిన్ ఎదురుదాడిలో టీమ్ ఇండియా ఇతర బ్యాటర్లు నిరాశపరిచినా.. వన్‌మ్యాన్ షోతో యశస్వి జైస్వాల్ భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ (34, 46 బంతుల్లో 5 ఫోర్లు), రజత్ పటీదార్ (32, 72 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. యశస్వి జైస్వాల్ వీరవిహారంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 336/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అరంగ్రేట స్పిన్నర్ షోయబ్ బషీర్ (2/100), రెహాన్ అహ్మద్ (2/61) రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్ (5 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆటలో 93 ఓవర్లలో 3.61 రన్‌రేట్‌తో భారత్ 336 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ ఆరు వికెట్లు పడగొట్టింది.
ఆరంభం అదిరింది : భారత్ 103/2
విశాఖ టెస్టులో కీలక టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (14) మరోసారి శుభారంభం అందించారు. జైస్వాల్ సహజశైలిలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. తొలి వికెట్‌కు రోహిత్, జైస్వాల్ 105 బంతుల్లో 40 పరుగులు జోడించారు. అరంగ్రేట స్పిన్నర్ బషీర్ లెగ్ స్లిప్స్‌లో రోహిత్ శర్మకు వల విసిరాడు. దీంతో ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నం.3 బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (34)తో జట్టుకట్టిన జైస్వాల్.. మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. గిల్ క్రీజులోకి వచ్చాక స్కోరు బోర్డును అతడే ముందుకు నడిపించాడు. ఐదు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కానీ అండర్సన్ ఓవర్లో వికెట్ కీపర్‌కు చిక్కటంతో మెరుపు ఇన్నింగ్స్‌కు తొలి సెషన్లోనే తెరపడింది. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్తఓ 89 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి లంచ్ విరామ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. తొలి సెషన్లో భారత్ 31 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు చేసింది.
యశస్వి శతక విహారం : భారత్ 225/3
లంచ్ విరామం అనంతరం యశస్వి జైస్వాల్ దంచికొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ (27, 59 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు జైస్వాల్ 131 బంతుల్లోనే 90 పరుగులు జోడించాడు. ఇందులో జైస్వాల్ 72 బంతుల్లో 63 పరుగులు చేయగా.. అయ్యర్ 59 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన అయ్యర్.. హర్ట్‌లీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కీలక మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 94 పరుగుల వద్ద ఉండగా.. హర్ట్‌లీ ఓవర్లో క్రీజు వదిలి ముందుకొచ్చి భారీ సిక్సర్‌తో శతకం విన్యాసం చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 151 బంతుల్లోనే జైస్వాల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్‌తో పోటీపడి తుది జట్టులో నిలిచిన రజత్ పటీదార్ విశాఖ టెస్టులో అరంగ్రేటం చేశాడు. టీ విరామ సమయానికి యశస్వితో కలిసి పటీదార్ అజేయంగా నిలిచాడు. ఈ సెషన్లో భారత్ ధారాళంగా పరుగులు పిండుకుంది. 31 ఓవర్లలోనే ఏకంగా 122 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్‌కు మాత్రం ఒక్క వికెటే దక్కింది.
ఎదురులేని జైస్వాల్ : భారత్ 336/6
చివరి సెషన్‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. భారత్ 30 ఓవర్లలో 111 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ రేసులో నిలిచింది. యశస్వి, పటీదార్ 70 పరుగుల నాల్గో వికెట్ భాగస్వామ్యానికి రెహాన్ అహ్మద్ తెరదించాడు. రెహాన్ బంతిని డిఫెన్స్ ఆడబోయిన పటీదార్.. వికెట్‌ను కోల్పోయాడు. అక్షర్ పటేల్ (27, 51 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా యశస్వి జోరు పెంచాడు. అక్షర్ నాలుగు ఫోర్లతో మెరువగా.. యశస్వి 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 224 బంతుల్లో 150 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అక్షర్ పటేల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం శ్రీకర్ భరత్ (17) నిరాశపరిచాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో సరిపెట్టాడు. సొంత మైదానంలో అభిమానుల నడుమ భావోద్వేగాలకు గురైన భరత్ ధనాధన్‌కు వెళ్లాడు. ఆ క్రమంలో రెహాన్ అహ్మద్‌కు వికెట్ కోల్పోయాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో యశస్వి వెనక్కి తగ్గలేదు. అజేయంగా 179 పరుగులు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ (5 బ్యాటింగ్)తో కలిసి మరో భాగస్వామ్యానికి తెరతీశాడు. మూడు 50 ప్లస్, రెండు 40 ప్లస్ భాగస్వామ్యాలు నిర్మించిన యశస్వి జైస్వాల్.. భారత ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నిలబెట్టాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ నాటౌట్ 179, రోహిత్ శర్మ (సి) పోప్ (బి) బషీర్ 14, శుభ్‌మన్ గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34, శ్రేయస్ అయ్యర్ (సి) ఫోక్స్ (బి) హర్ట్‌లీ 27, రజత్ పటీదార్ (బి) రెహాన్ అహ్మద్ 32, అక్షర్ పటేల్ (సి) రెహాన్ అహ్మద్ (బి) బషీర్ 27, శ్రీకర్ భరత్ (సి) బషీర్ (బి) రెహాన్ అహ్మద్ 17, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (93 ఓవర్లలో 6 వికెట్లకు) 336.
వికెట్ల పతనం: 1-40, 2-89, 3-179, 4-249, 5-301, 6-330.
బౌలింగ్: జేమ్స్ అండర్సన్ 17-3-30-1, జో రూట్ 14-0-71-0, టామ్ హర్ట్‌లీ 18-2-74-1, షోయబ్ బషీర్ 28-0-100-2, రెహాన్ అహ్మద్ 16-2-61-2.