జయహో నాటు

– తెలుగు పాటకు దక్కిన అరుదైన గౌరవం
– ఆస్కార్‌ వేదికను ఊపేసిస నాటు నాటు పాట
భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్‌ తధ్యమంటూ ప్రపంచ సినీ విశ్లేషకులు చెప్పిన జోస్యం నిజమైంది. ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు నామినేషన్‌ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటుగానూ ఆస్కార్‌ అందుకుని చరిత్ర సష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంపై నిలబెట్టింది. ప్రతీ తెలుగువాడిని గర్వపడేలా చేసింది. భారతీయ సినిమాకు ఎన్నో ఏండ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్‌ అవార్డును ‘నాటు..నాటు’ పాట సాకారం చేసింది.
– చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌
– భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయం
– ఆ కలని సాకారం చేసిన ఘనత రాజమౌళిదే..
– బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌గా ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’
– ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌కి ఉత్తమ చిత్రంతో సహా 6 ఆస్కార్‌లు..

లాస్‌ ఏంజిల్స్‌ : యావత్‌ భారతీయులందరినీ గర్వపడేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిదిన్నర దశాబ్దాల ఆస్కార్‌ చరిత్రలో ఆస్కార్‌ని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా పాటగానే కాకుండా తొలి తెలుగు సినిమా పాటకి దక్కిన అరుదైన గౌరవం ఇది. ఈ కల కేవలం దర్శకుడు రాజమౌళి వల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల్లో మన దేశం మూడు నామినేషన్లతో రంగంలోకి దిగింది. అయితే మన దేశం నుంచి బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’కి అవార్డు దక్కలేదు.
అట్టహాసంగా…
లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రదానోత్సవం ఆరంభమైంది. ఈ వేడుక ఆరంభంలోనే వ్యాఖ్యాత జిమ్మీ కెమ్మిల్‌ స్టేజ్‌పైకి వస్తున్నప్పుడు కొంతమంది డాన్సర్లు ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తూ రావడం ఓ విశేషమైతే, ఇదే స్టేజ్‌ మీద ఇదే పాటను తెలుగు గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడగా లైవ్‌లో హాలీవుడ్‌ నటీనటులు డాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ చేయటం మరో విశేషం. ఈ పాట సందర్భాన్ని చెప్పేందుకు బాలీవుడ్‌ అగ్రకథానాయిక దీపికా పదుకొనె ఆస్కార్‌ వేదికపై మెరిసినప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది.
‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’
అలాగే ప్రకృతికి, మనుషులకు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీ సైతం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకుని మన దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచింది.
ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో ఇప్పటివరకు భారతీయులు కూడా అవార్డులు అందుకున్నారు. కానీ వారంతా విదేశీ చిత్రాలకు పని చేశారు. అయితే ఈసారి ఆస్కార్‌ని అందుకుంది మన చిత్రాలకు పని చేసిన మన వాళ్లే కావడం విశేషం.
‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’
ఇదిలా ఉంటే, ఓ వలస కుటుంబం చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌కి ఎంపికైంది. అంతేకాదు ఈ
సినిమా ఏకంగా మరో 6 ఆస్కార్‌లను కైవసం చేసుకుని 95వ ఆస్కార్‌ అవార్డుల్లో ప్రధమ స్థానంలో నిలిచింది. మొత్తం 11 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను గెలిచి రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌, ఉత్తమ విదేశీ చిత్రం విభాగాల్లో ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రం సొంతం చేసుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక ‘ది వేల్‌’ చిత్రం కూడా బెస్ట్‌ మేకప్‌, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఆస్కార్లను దక్కించుకుంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌), ఉత్తమ నటిగా మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), ఉత్తమ దర్శకులుగా డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) ఆస్కార్‌లను సొంతం చేసుకున్నారు.