లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించ నున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నటుడు, దర్శకుడు సాయి వెంకట్‌కు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఈచిత్రంలోని లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలోని పాటల రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. సంగీత, సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని, ఖర్చుకు వెనకాడకుండా డిజైన్ చేశాం. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యులు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను’ అని తెలిపారు. ‘నాన్న (సాయి వెంకట్) సినిమా కోసం ఎంత శ్రమించారో, ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా నాన్నకి ఒక కల. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించాం. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అని నిర్మాత ప్రవళ్లిక అన్నారు.