

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే దాటి నాలుగు మండలాల్లోని 40 గ్రామాలకుపైగా రాకపోకలు (ప్రయాణం) కొనసాగించడానికి అండర్ పాస్ నిర్మాణం చేయాలని ఈనెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్ సిల్వేరు ఎల్లయ్య , కో- కన్వీనర్లు మందడి సిద్ధారెడ్డి పిలుపునిచ్చినారు. అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి, వలిగొండ,మోటకొండూరు, ఆత్మకూరు మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించామని ఎల్లయ్య , సిద్ధారెడ్డి తెలియజేశారు. గత 14 సంవత్సరాల నుండి అండర్ పాస్ నిర్మాణం చేయకపోవడం వల్ల రోడ్డు దాటుతూ వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిశాయని ఆవేదన వెలిబుచ్చారు. అనేకమంది ఆక్సిడెంట్ లో కాళ్లు చేతులు పోగొట్టుకొని అంగవైకల్యంతో అప్పుల పాలై బతుకు జీవుడా అని బ్రతుకుతున్నారని అన్నారు. పాలకులు మారిన, ప్రజాప్రతినిధులు మారిన, ప్రభుత్వాలు మారిన ఆయా గ్రామాల ప్రజల బతుకులు మాత్రం మారలేదని వారు వాపోయారు. కేవలం ప్రజలను ఓట్లప్పుడు ఓటర్స్ గా చూస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను, జవాబుదారితనాన్ని మాత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అమలు చేసి పాటించడం లేదని విమర్శించారు. కనీస జ్ఞానము పరిజ్ఞానమున్న ఎవరైనా ఒక రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు దాటడానికి సరైన మార్గం ఉండాలని ఆలోచన ఎందుకు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణ చేసి వందలాది మందితో 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే సడక్ బంద్, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.