25న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

– వ్యకాస రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-చౌటుప్పల్‌
ఉపాధిహామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు. శుక్రవారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో రాష్ట్ర సదస్సు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షాలు, ప్రజసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, మేధావులు ఐక్యంగా ఉండి యుపీఏ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా ఉపాధిహామీ చట్టం వచ్చిందన్నారు. 9ఏండ్ల క్రితం బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధిహామీ చట్టాన్ని ఏత్తేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కొత్త జీవోలను తెస్తూ చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా పనిప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రతి బడ్జెట్‌లోనిధులు, పనిదినాలు తగ్గిస్తూ కూలీలపై భారాలు మోపుతున్న పరిస్థితి ఉందన్నారు. కొలతలతో సంబంధం లేకుండా చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని, ఏడాదికి 200రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గండబేరి సైదులు, మండల కార్యదర్శి బొజ్జ బాలయ్య, బోయ యాదయ్య పాల్గొన్నారు.