– ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి కోసమేనా!
– పదేండ్లుగా పరిశ్రమలు, ఐటీ శాఖలో కీలక బాధ్యతలు
– కేటీఆర్ అవినీతిపై విచారణంటూ ప్రచారంతోనేనా?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో పదేండ్ల నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య, ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోబోతున్నట్టు ప్రచారం ఊపందుకున్నది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనకు వాస్తవానికి మరో మూడేండ్ల పాటు (2027 సెప్టెంబర్ వరకు) సర్వీసు ఉంది. 2014-23 కాలంలో తెలంగాణకు అనేక బహుళ జాతి సంస్థలను ఆకర్షించటంలో రంజన్ కీలక పాత్ర పోషించారు. గత కేసీఆర్ సర్కార్ హయాంలో పరిశ్రమల శాఖలో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరుపబోతున్నదనీ, అందులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు జయేశ్ రంజన్ పాత్ర కూడా ఉందని నిరూపణయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయన వీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఆయన్ను పరిశ్రమల అధిపతిగా నియమించుకోవాలని భావించింది. అయితే, సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన పొరుగు రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం లేదు. దీంతో రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని సిద్ధపడుతున్నట్టు తెలిసింది. జయేశ్ రంజన్ పదేండ్ల అనుభవాన్ని వాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఏపీ ఐఏఎస్ అధికారుల వద్ద బాబు ప్రస్తావించగా..రంజన్ కింద పనిచేసేందుకు వారు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన నియామకం కాస్త సందిగ్ధంలో పడింది. అయినా, ఆయన సేవలను ఎలాగైనా వినియోగించుకోవాలని మంత్రి లోకేశ్ పట్టుదలగా ఉన్నారనీ, హైదరాబాద్ కేంద్రంగానే ఆయనతో పనిచేయంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారని తెలిసింది. అయితే, ఆయన్ను ఏ హౌదాలో నియమిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రక్రియ పూర్తికాగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశముంది.