నవతెలంగాణ – శాయంపేట
అనుమతికి మించి చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న హిటాచి 200 మిషన్, 5 ట్రిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై సిహెచ్. ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం… మండలంలోని తహారాపూర్ గ్రామంలోని పోచమ్మ కుంట చెరువు మట్టిని పంట పొలాలలో పోసుకోవడానికి అదే గ్రామానికి చెందిన గొట్టిముక్కల విష్ణువర్ధన్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో పర్మిషన్ తీసుకున్నాడు. అధికారులు జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో మట్టి తరలించుటకు పర్మిషన్ ఇవ్వగా, నిబంధనలకు విరుద్ధంగా 200 మిషన్ (హిటాచి) తో పర్మిషన్కు మించి ట్రిప్పర్లతో మట్టి తరలించడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. గిరిధర్ కు గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో డిఈఈ గిరిధర్ విష్ణువర్ధన్ రెడ్డి, హిటాచి, ట్రిప్పర్ డ్రైవర్ల పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డి ఈఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మట్టిని తరలిస్తున్న హిటాచి 200 మిషన్, ఐదు ట్రిప్పర్లను అదుపులోకి తీసుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు.