– జూన్ 4న దేశవ్యాప్తంగా రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశమున్నది. ఈ మేరకు ఐఐటీ గువాహటి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. వారిలో 1.90 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసినట్టు సమాచారం. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా, 44 వేల మంది అమ్మాయిలున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాతపరీక్ష జూన్ నాలుగో తేదీన ఐఐటీ గువాహటి దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రాథమిక సమాధానాల కీని వచ్చేనెల 11న, ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌తో మొత్తం 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. అడ్మిట్ కార్డులను www.jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.