నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ రాతపరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధించారు. వారిలో 1.91 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేశారు. గతనెల 26న ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాతపరీక్షలు రాసిన అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను గతనెల 31 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీని ఈనెల రెండో తేదీన విడుదల చేశారు. ఐఐటీల్లో సీట్ల ప్రవేశాలకు సంబంధించి ఈనెల 10 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.