నవతెలంగాణ – నవీపేట్
బోధన్ లో చక్కెర కర్మాగారం ప్రారంభించడం సుదర్శన్ రెడ్డి వంతు నవీపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం తనవంతని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన రోడ్ షో లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి హోంశాఖ మంత్రి అమిత్ షా బోధన్ చక్కెర కర్మాగారం ప్రారంభించడం రైతులదే బాధ్యత అని చెప్పడం బిజెపికి రైతుల సంక్షేమ పై ఉన్న నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించేందుకు 43 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. విలాసవంతంగా జీవించేందుకు అలవాటు పడ్డ అరవింద్ ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని కాబట్టి ప్రజలు ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు. గతంలో ఎంపీగా చేసిన కవిత చక్కెర కర్మాగారం తెరిపిస్తానని చెప్పి కారాగారానికి వెళ్లిందని విమర్శించారు. ఆగస్టు 15 తేదీలోగా 2 లక్షల రుణమాఫీ, గృహలక్ష్మి, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. అపార అనుభవం కలిగిన జీవన్ రెడ్డిని తనకు తోడుగా గెలిపించి పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ కుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, నవీన్ రాజ్, మూసా, జబీర్ తదితరులు పాల్గొన్నారు.