– బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు బీఆర్‌ఎస్ సభ్యులు లోక్ సభ, రాజ్యసభలో కేంద్రంతో కొట్లాడారని గుర్తుచేశారు. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆయా మండలాల విలీనాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ఇలాంటి వాస్తవాలను తెలుసుకోవాలంటూ ఆయన జీవన్ రెడ్డికి హితవు పలికారు. తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.