నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీస్‌ ను అందజేసి మూడు రోజులు గడుస్తున్నా..ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో జూనియర్‌ డాక్టర్లు నిరసన బాట పట్టారు. గురువారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో నల్లబ్యాడ్జీలను ధరించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్దేశిత సమయంలో ఉపకార వేతనాల విడుదల, పెండింగ్‌ స్టయిఫండ్‌ విడుదల, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్లకు గతంలో ఒప్పుకున్న మేరకు స్టయిఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్‌, ప్రభుత్వాస్పత్రుల్లో భద్రత, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు సరిపడేలా కొత్త హాస్టళ్ల నిర్మాణం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.