నవతెలంగాణ- పెద్దవంగర: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలుకు నోచుకోని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను, వైఫల్యాలను ప్రజలకు వివరించి సంస్ధాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన ఎడ్ల రామచంద్ర రెడ్డి సతీమణి వృద్ధాప్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగు మురళీ గౌడ్, అనపురం శ్రీనివాస్ గౌడ్, పూర్ణచందర్, నాయకులు పాకనాటి ఉపేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సతీష్, చెరుకు సత్యం, చిలుక సంపత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.