
– ధర్నా చౌక్ వద్ద దీక్షలు ప్రారంభించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
– అంగన్వాడి దీక్షలకు సంఘీభావం తెలిపిన రిటర్మెంట్ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు
నవతెలంగాణ – కంఠేశ్వర్
జీవో 10 వి రద్దు చేయాలని సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని ధర్నా చౌక్ లో చేస్తున్న దీక్షలను సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మంగళవారం ప్రారంభించారు. అంగన్వాడి దీక్షలకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడి ఉద్యోగులను 65 సంవత్సరాల పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, యూనియన్ జిల్లా కోశాధికారి చంద్రకళ మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగుల సమస్యల తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరువధిక సమ్మె చేయడం జరిగిందని అన్నారు. ఆ సమ్మె సందర్భంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసీడీఎస్ మంత్రి సీతక్కకు ఉన్నతాధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈ జీవో అమలు చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తక్కువ బెనిఫిట్ ఇచ్చి అన్యాయంగా తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి, జగదాంబ, అరుణ, లక్ష్మి, రోజి, సునంద, గంగు, గౌరీ, లక్ష్మీబాయి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.