– రేపు తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు
నవతెలంగాణ-హైదరాబాద్
కోర్టు కేసులు, ఎలక్ట్రోరల్ కాలేజ్లో నిబంధనల ఉల్లంఘనలు సహా ఐఓఏ నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు నడుమ ఎట్టకేలకు తెలంగాణ ఒలింపిక్ సంఘం (టిఓఏ) ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. జూన్ 9న జరగాల్సిన ఎన్నికలు న్యాయస్థానం జోక్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 25న ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విడుదల చేసిన ఎలక్ట్రోరల్ కాలేజ్ ప్రకారం టీఏఓ ఎన్నికల్లో 66 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పలు కారణాలతో ఇద్దరు సభ్యులకు ఓటు హక్కు నిరాకరించారు. సాధారణ మెజారిటీ కనీసం 34 ఓట్లు సాధిస్తే ఎన్నికల్లో విజయం సాధించవచ్చు. ఎల్బీ స్టేడియం ఆవరణలోని ఒలింపిక్ భవన్లో గురువారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు.
అధ్యక్ష రేసు ఆసక్తికరం : అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు మాత్రమే ఎన్నిక నిర్వహించనున్నారు. ఉపాధ్యక్ష పదవి (4), సంయుక్త కార్యదర్శులు (4), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు (క్రీడా సంఘాలు 10, జిల్లా ఒలింపిక్ సంఘాలు 5) ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ప్రెసిడెంట్ పదవి కోసం ఏపీ జితేందర్ రెడ్డి, వి. చాముండేశ్వరనాథ్ పోటీపడుతున్నారు. ఏపీ జితేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుగా కొనసాగుతున్నారు. టీఓఏ అధ్యక్ష పదవి రేసులో రాష్ట్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్న జితేందర్ రెడ్డి వైపు ఎలక్ట్రోరల్ కాలేజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాక కార్యదర్వి పదవికి మల్లారెడ్డి, బాబురావు పోటీపడుతున్నారు. కోశాధికారి పదవి కోసం సతీశ్ గౌడ్, ప్రదీప్ కుమార్ పోటీపడుతున్నారు. ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్ చారి, సంజీవ్ రెడ్డి, అమిత్ సంఘీ, అప్పారావు… సంయుక్త కార్యదర్శులుగా జనార్థన్ రెడ్డి, విజరు కుమార్, మహ్మద్ ఖాజ ఖాన్, ఉమేశ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.