– ఎనిమిది లక్షల మందితో
– అలరారిన పుస్తక ప్రదర్శన
– ఏ స్టాలు చూసినా పుస్తకం రారమ్మని పిలిచే
– 50 మంది యువకవులను పరిచయం చేసిన బుక్‌ఫెయిర్
– భిన్న భావజాలాలకు కేరాఫ్ అడ్రస్
– విజయవంతంగా ముగిసిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్, సామాజిక మాధ్యమాలెన్ని వచ్చినా పుస్తకం క్రేజీనే వేరు. అందుకే కాబోలు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రతి ఏటా విజయవంతం అవుతున్నది. ఈసారీ 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇసుకేస్తే రాలనంత పుస్తకప్రియులతో కొత్త శోభను తెచ్చిపెట్టింది. ఏ ఇజం అయితేనేం..చదివే ఇజం అందర్నీ ఒక్కచోటుకు రప్పించింది. ఏ స్టాలు వైపు చూసినా రారమ్మని అంటూ పిలిచే పుస్తకాలతో అలరింపజేసింది. పుస్తకం తనలోని పదునైన పదజాలంతో పాఠకప్రియులను ఆకర్షించింది. వేలకు వేల రూపాయలు పెట్టి పుస్తకాలను కొనిపించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ దశాబ్ద కాలంలో కోటి మంది పుస్తక ప్రియులకు చేరువై జాతీయ పుస్తక ప్రదర్శన కొత్త చరిత్ర సృష్టించింది.పుస్తకమంటే ప్రపంచ జ్ఞానం
పుస్తకమంటే వ్యక్తిత్వ వికాసం
పుస్తకమంటే ఓ రాజకీయ చైతన్యం
పుస్తకమంటే మానసిక ఆరోగ్యం
పుస్తకమంటే చీకటిలో దారిచూపే దీపం
పుస్తకమంటే హస్తభూషణం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఏటా డిసెంబర్‌లో ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్‌ఫెయిర్-రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పుస్తక ప్రదర్శన పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఎన్నికల నేపథ్యంలో ఈసారి కాస్త ఆలస్యమైంది. అయినా, పుస్తక ప్రియుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. మాసం ఏదైతేనేం అధ్యయనం కోసం పరితపించేవాళ్లం అన్నట్టుగా కదిలివచ్చారు. ప్రారంభం రోజు (ఫిబ్రవరి 9 రాత్రి) పోనూ మిగిలిన పదిరోజుల్లోనే 8 లక్షల మంది జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. అంతేకాదండోరు.. ప్రముఖ ప్రజా కవి గద్దర్ ప్రాంగణంలోని రవ్వా శ్రీహరి వేదిక 100 మందికిపైగా కొత్త రచయితలను సమాజానికి పరిచయం అయ్యారు. అందులో 50 మందికిపైగా యువ రచయితలే కావడం గమనార్హం. రచన వైపు యువత రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. పుస్తక ప్రదర్శనలో వేదికకు ఎదురుగా అమరవీరుల స్థూపం, గద్దర్ ఫొటో వద్ద యువత పోటీపడి సెల్ఫీలు దిగడం కనిపించింది. ఉర్దూ భాషలో ప్రచురితమైన పుస్తకాల కోసం ఏర్పాటు చేసిన బుక్‌స్టాల్ ప్రత్యేకంగా కనిపించింది. గతేడాది కంటే సందర్శకుల తాకిడి కొంత తగ్గినా పుస్తకాల కొనుగోళ్లు మాత్రం బాగా పెరిగాయని ఒక స్టాల్ నిర్వాహకులు చెప్పాడు. 362 స్టాల్స్‌తో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఈసారి చివరి బుక్‌స్టాల్ వరకూ సందర్శించే వారి సంఖ్యా ఎక్కువగానే కనిపించింది.
బుద్ధిజం, వేమన శతకాలకు సంబంధించిన పుస్తకాలు అమ్మే చివరి స్టాల్‌లోనూ ఒక పుస్తక ప్రియుడు ఒకేసారి రూ.2900 వెచ్చించి పుస్తకాలు కొనుక్కోని పోవడం కనిపించింది. చిన్నపిల్లలకు సంబంధించిన స్టాళ్లనూ ఎక్కువగానే ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షల సీజన్ కావడంతో పుస్తక ప్రదర్శనకు పిల్లలు తక్కువ వచ్చారనీ, అమ్మకాలు కూడా గతం కంటే కొంత తగ్గాయని ఎడ్యుకేషనల్ స్టాల్స్ నిర్వాహకులు చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం రవ్వా శ్రీహరి వేదికగా సాంస్కృతిక ప్రదర్శనలు, పుస్తకాల ఆవిష్కరణలు వీక్షకులను ఆకర్షింపజేశాయి. రచయితలు, ప్రముఖుల ప్రసంగాలు ఆలోచింపజేశాయి. పిల్లలను ఫోన్లకు బానిసలు చేయకుండా పుస్తక పఠనం వైపు మళ్లించాలనే మెసేజ్‌ను బుక్ ఫెయిర్ ఇచ్చింది. పుస్తక అధ్యయనం ఆలోచనలను పెంచి ప్రశ్నించే తత్వాన్ని, పోరాడేతత్వాన్ని పెంచి మెరుగైన సమాజం వైపునకు అడుగులు వేయించడంలో దోహదపడుతుందనే స్పష్టతనిచ్చింది.