నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సికార్ జిల్లాలోని ధోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రధాన ఎన్నికల అంశం. బయో-వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో పవర్ ప్లాంట్‌కు ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నిధులు సమకూరుస్తుంది. ఇది పెద్ద ఎత్తున పర్యావరణ కాలుష్యానికి, పంట విధ్వంసానికి దారి తీస్తుందని ధోడ్‌లో ఆందోళనలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) నేత పేమారామ్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, ధోడ్ మాజీ ఎమ్మెల్యే అమ్రారామ్ కూడా ఆందోళనలో ముందున్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పేమారామ్‌ను ధోడ్‌కు రక్షకుడిగా స్థానికులు కొనియాడారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గమై న ధోడ్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పేమారామ్ బరిలో నిలి చారు. సీపీఐ(ఎం) వరుసగా నాలుగుసా ర్లు గెలిచిన నియోజకవర్గం ధోడ్. అమ్రారామ్ మూడుసార్లు గెలిచారు. 2008లో రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత ధోడ్ ప్రజలు పేమారామ్‌ను ఎన్నుకున్నారు. 2013, 2018లో పేమారామ్ రెండో స్థానంలో నిలిచారు. 2013లో బీజేపీ గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. పేమారామ్‌పై ధోడ్ ప్రజలకు ఉన్న ప్రేమ ఎన్నికల ర్యాలీలో కూడా ప్రతిబింబించింది. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో వేలాదిగా ర్యాలీగా తరలివచ్చారు. రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు మైదానాన్ని ఎర్రని సముద్రంగా మార్చారు. గంటల తరబడి ఎండలో నేలపైనే కూర్చుని నేతల మాటలు విన్నారు. ప్రసంగాంచిన వాళ్లంతా బీజేపీపై విరుచుకుపడ్డారు. అశోక్ గెహ్లాట్ హయాంలో జరిగిన అభివద్ధి లోపాన్ని, అవినీతిని ఎత్తిచూపారు.
2013లో గెలుపొందిన గోర్ధన్ వర్మ బీజేపీ అభ్యర్థి, వరుసగా మూడో బరిలోకి దిగారు. కాంగ్రెస ్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్శరామ్ మొరాడియా కు ఈసారి టిక్కెట్ దక్కలేదు. అతని కుమారుడు మహేశ్ మొరాడియా కూడా టిక్కెట్ ఇవ్వలేదు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన జగదీష్ ధనోడియా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సరైన అభ్యర్థి దొరకకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ధనోడియాను కాంగ్రెస్ తన అభ్యర్థిగా చేసింది. రాజకీయాలకు కొత్త అయిన ధనోడియా స్థానికుడు కాదు. తనకు, తన కుమారుడికి టిక్కెట్టు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో విభేదిస్తున్నారు. హనుమాన్ బేనివాల్ ఆర్‌ఎల్‌పి అభ్యర్థిగా ఆయన కుమారుడు మహేశ్ మొరాడియా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బలహీనపడటంతో నియోజక వర్గంలో దాదాపు ఇరవై వేల మంది మైనార్టీలు పూర్తిగా పేమారామ్ వెంటే ఉన్నారని సీపీఎం నేతలు అన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటంలో పేమారామ్ నాయకత్వాన్ని ఆయనకు సానుకూల అంశంగా ఉంది.
ధోడ్‌లో సత్తా చాటుతాం : పేమారామ్‌జి
ధోడ్ నియోజకవర్గాన్ని తిరిగి సీపీఐ(ఎం) కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉందని అభ్యర్థి పేమారామ్ ి తెలిపారు. ”గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు పరీక్ష పెట్టారు. ఫలితంగా నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉంది” అని తెలిపారు. ”ధోడ్ సీపీఐ(ఎం)కి బలమైన నియోజకవర్గం. బూత్ కమిటీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నాయి. ర్యాలీలో భారీ ప్రజాదరణ చురగొనడం కూడా మంచి అంశం. పర్యావరణాన్ని దెబ్బతీసే పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాడింది సీపీఐ(ఎం) మాత్రమే. కాంగ్రెస్, బీజేపీలు పాల్గొలేదు. ఈ విషయాలన్నీ ఓటర్లకు బాగా తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు సీపీఐ(ఎం)లోకి వస్తున్నారు” అని పేమారామ్ అన్నారు.