‘ఉద్యోగ’ క్యాలెండర్‌ ప్రకటించాలి

‘మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టు’ అనేది తెలంగాణలో ఇచ్చే ఉద్దేశం, ఆశలను తీర్చే ఉద్దేశం లేనప్పుడు చేసే పనులను తెలుపడానికి విరివిగా వాడే సామెత. గిప్పుడు తెలంగాణ నిరుద్యోగుల పట్లా తెలంగాణ ప్రభుత్వం తీరు గూడా గిట్లనే ఉన్నది. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో యువత ముందువరుసలో నిలబడి కొట్లాడింది తమ ఉద్యోగాలు తమకు దక్కుతాయని. కొత్త ఉద్యోగాల సృష్టి జరిగి తమ కలలు నెరవేరుతాయని. వందల మంది యువత ప్రాణాలను అర్పించింది. బలిదానాలు భవిష్యత్తు యువత జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశతోనే. కానీ వారి బలి దానాల విలువలేకుండా పోయింది. నిరుద్యోగ యువత ఆశలు నీరుగారి పోతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క నాడు నిరుద్యోగుల గురించి, నూతన ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించిన పాపాన పోలేదు. పైగా ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింద’న్న చందంగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకడం కాదు సుమా విఆర్‌వోలను తొలగించి ఆ వ్యవస్థనే లేకుండా చేసింది. మొత్తం తెలంగాణలో ప్రభుత్వం శ్రద్ధతో నింపిన ఉద్యోగాలు ఏవైనా ఉంటే అవి కేవలం పోలీస్‌ ఉద్యోగాలు మాత్రమే. వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే టిఆర్‌టి పేరుతో వందల్లో నామ్‌కే వాస్తు నింపి చేతులు దులుపుకున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పేద విద్యార్థుల మెరుగైన విద్యకోసం అని కేసీఆర్‌ మానస పుత్రిక అయిన కేజీ టూ పీజీ విద్యను అందించడం కోసమని 500పై చీలుకు నూతన గురుకులాలను స్థాపించడం స్వాగతించాల్సిన విషయం. కానీ ఇన్ని గురుకులాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు బోధన, బోధనేతర ఇతర అన్ని రకాలా సిబ్బందినీ నియమించలేదు. ఇది ఆక్షేపనీయమే కాక పేద ప్రజల విద్య పట్లా ప్రభుత్వాల ఉదాసీనతకు తార్కాణం.
ప్రభుత్వమే ఉద్యోగాల కల్పన,నియామకాల పట్లా నిర్లక్ష్యంగా ఉన్నదనడానికి టిఎస్‌పిఎస్‌ పేపర్లలీక్‌ ఒక పెద్ద ఉదాహరణ. ఆ ఒక్క ఘటన స్వరాష్ట్రంలో ఉన్నత కొలువులో ఉండాలని ఆశించిన ఎంతో మంది నిరుద్యోగుల మానసిక స్త్యైరాన్ని, స్వరాష్ట్రం సాధన పట్లా వారి నమ్మకాన్ని ఎంత పోగొట్టింది అనేది ఈ పాలకులకు ఏమి పట్టడం లేదు. పాలకుల పాపానికి ప్రతిసారీ తెలంగాణ నిరుద్యోగ యువతే భంగపాటుకు గురవుతున్నది. ఏ ఏడు కాయేడు ప్రత్యేక ఉద్యోగ క్యాలెండర్‌ తీసి దాని ప్రకారం ఉద్యోగాలు నింపాల్సింది పోయి అసలు ఎప్పుడూ ఎట్లా నిర్వహిస్తాయో తెలియని అయోమయ స్థితికి తెలంగాణ ప్రభుత్వమే తీసుకుపోయింది. కనీసం ఉద్యోగ అర్హతకు సంబంధించిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించని స్థితిలో ఉన్నది ఇప్పుడు. ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలన్న టెట్‌నీ నిర్వహించడం లేదు. ఏడాదికొకసారి నిర్వహించాలన్న సెట్‌నీ సరిగా నిర్వహించక పోవడం వల్ల వేలాది ఉపాధ్యాయ, అధ్యాపక అభ్యర్థులు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. నలుగురు కలిసిన చోట నిరుద్యోగ యువత మన మెడమీద మనమే కత్తి పెట్టుకున్నమార ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని అని నిరాశతో అనుకుంటున్నారు. రాష్ట్రం వచ్చి పదేండ్లు దగ్గరికి వస్తున్న ఇప్పటివరకు ఒకసారి కూడా ఉన్నత విద్యా శాఖలో డిగ్రీ కళాశాల అధ్యాపక కొలువులు నింపలేదు. మూడేండ్లుగా సెట్‌ నిర్వహించలేదు. ఇప్పుడు గురుకుల డిగ్రీ కళాశాలలో అధ్యాపక కొలువుల నియామక నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ కొత్తగా సెట్‌ అర్హత సాధించి అధ్యాపక కొలువు సాధించాలని కలలు కంటున్న వారికి మాత్రం అది చేదు గులికే అవుతున్నది.
ప్రభుత్వం సెట్‌ పరీక్షను ఆలస్యంగా పెట్టడమే కాకుండా నియామక నోటిఫికేషన్‌ కంటే ముందుగా అర్హత సాధించిన వారు మాత్రమే అర్హులు అని తెలుపడం ద్వారా ఇటీవల ప్రభుత్వం 29సబ్జెక్టుల్లో నిర్వహించిన సెట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన 2857మంది అప్లై చేసుకునే గడువు ఉన్నా ప్రభుత్వ నిబంధనలతో అనర్హులుగా మారుతున్నారు. ‘అంగట్ల అన్ని ఉన్న అల్లుని నొట్లే శని ఉన్నది’ అనే మాదిరిగా ఉన్నది నూతన సెట్‌ అర్హత సాధించిన అభ్యర్థుల పరిస్థితి. ప్రభుత్వం సక్రమంగా సెట్‌, అర్హత పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తే నిరుద్యోగులు, ఆశావహ అభ్యర్థులు ఇంత ఆందోళన పడకపోదురు. ప్రభుత్వాల తప్పిదాలకు నిరుద్యోగ యువతను బలిచేయకుడదు. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులందరికీ అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. ఇట్లా అవకాశం కల్పించడం ద్వారా కొత్త వారిని సెట్‌ చేస్తే ప్రభుత్వం ఎంతో కొంత తనపైన గల నిరుద్యోగుల అసంతృప్తులను ఎంతో కొత్త తగ్గించు కోగలదు. ఏ ఆశలతో తెలంగాణ కోసం యువత కొట్లాడిండ్రో ఆ ఆశలను నెరవేర్చడానికి సక్రమమైన ప్రణాళికతో ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌ ప్రకటించాలి. ఔట్‌ సోర్సింగ్‌, ఒప్పంద ప్రాతిపదిక నియామకాల స్థానే శాశ్వత ఉద్యోగాల నియామకం జరిపినప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది. బలిదానం చేసుకున్న విద్యార్థి, యువత బలిదానాల ప్రయోజనం నెరవేరినట్టు అవుతుంది.
– వి. దిలిప్‌
8464030808