ఖాళీలను మరిచిన ‘జాబ్‌ క్యాలెండర్‌’

'Job Calendar' which forgets the vacancies‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దు కుంటుంది’ అంటారు ప్రముఖ విద్యావేత్త దౌలత్సింగ్‌ కొఠారి. తరగతిగదిలో దేశ భవిష్యత్తును నిర్మాణం చేసే కథానాయకుడు ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసే విద్య కేంద్రాలు డైట్‌, బీ.ఎడ్‌, ఐఏఎస్‌ఈ కళాశాలలు. అటువంటి కళాశాలల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యధోరణిని అనుసరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాబ్‌ క్యాలెండర్‌లో ఈ ఖాళీల ప్రస్తావన లేకపోవడం శోచనీయాంశం. ఈ కళాశాలల్లో వందకు వంద శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో పది ప్రభుత్వ డైట్‌ కళాశాలలుండగా, వీటిలో ప్రతీ కళాశాలకు పద్దెనిమిది మంది సగటున ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఒక్క ఆదిలాబాద్‌ డైట్‌ కాలేజ్‌లో ఇద్దరు అధ్యాపకులు మాత్రమే డిప్యుటేషన్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని డైట్‌లలో వందకు వంద శాతం అధ్యాపకులు లేరు. వీటితో పాటు వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ప్రభుత్వ బీఈడీ కళాశాలలు (కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌-సీటీఈ), హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ స్టడీ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐఏఎస్‌ఈ-ప్రభుత్వ ఎంఈడీ కళాశాల)లలో వందకు వంద శాతం అధ్యాపకులు లేకపోవడం బాధాకరం. అయినా వీటిలో ప్రతీ సంవత్సరం వంద శాతం విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు, ఉత్త్తీర్ణత సాధిస్తున్నారు. అంటే ఆ కళాశాలల్లో తయారవుతున్న విద్యార్థి ఉపాధ్యాయుల ప్రామాణికత ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు.
ఎంత గమ్మత్తైన విషయం అంటే ‘బోధించే అధ్యాపకులు లేకపోయినా, ఏ విధమైన బోధన అభ్యాసన జరగకుండానే విద్యార్థులు ఉపాధ్యా యులుగా పట్టా పొంది బయటికి వస్తున్నారు. వైద్యం గురించి ఏమాత్రం అభ్యసించకుండా డాక్టర్‌గా పట్టా పొంది వైద్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మనం ఊహించవచ్చు. ఏవిధంగా బోధించాలనే కనీస శిక్షణ కూడా పొందకుండా వృత్తిలోకి ప్రవేశించి భావిపౌరుల భవిష్యత్తును తయారు చేసేస్థానంలో ఉపాధ్యాయులుగా కొనసాగడం కూడా అంతే ప్రమాదం. ప్రభుత్వ ఉపాధ్యా యుల పదోన్నతుల విషయంలో ఏకీకృత సర్వీస్‌ నిబంధనల కేసు గత దశాబ్దన్నర కాలంగా ఎటూ తేలడం లేదు. దీంతో రాష్ట్రంలోని ఈ కళాశాలల్లో పదోన్నతుల ప్రక్రియ నిలిచి పోయింది. ప్రత్యక్ష నియామకాల ద్వారా డైట్‌లలో 23 సీనియర్‌ అధ్యాపకులు, 65 అధ్యాపకుల ఖాళీలు, ఎస్సీఈఆర్టీ/ సీటీఈ/ ఐఏఎస్‌ఈలలో మరో 22 పోస్టులు కలిపి మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి 2022 నవంబరులో గత ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. వీటితోపాటు జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారులు డిప్యూటీ ఈవో పోస్టులు 24, మండల విద్యా పర్యవేక్షణ అధికారులు ఎంఈఓ పోస్టులు దాదాపుగా 78 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఈ కారణంగానే గత పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యలో దేశంలోనే అట్టడుగు స్థానానికి చేరింది. విద్యావ్యవస్థలో ఉద్యోగాలను భర్తీ చేయడం, వసతులు కల్పించడం, నాణ్యతను పాటించడంలో గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోలేదు. కనీసం విద్యశాఖపై వాస్తవ మైన సమీక్షలు జరిగిన దాఖలాలు కూడా లేవు.
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అవి అమలు కావాలంటే ముందు విద్యా రంగంలో ఉన్న ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్లు వేసి పోస్టుల్ని భర్తీ చేయాలి. గత సర్కార్‌కంటే భిన్నంగా కొత్త ప్రభుత్వం విద్యపట్ల శ్రద్ధ తీసుకోవడం మంచి పరిణామం. అయితే యువత ప్రభుత్వంపై పెట్టుకన్న ఆశల్ని వమ్ము చేయద్దు. అలాగే విద్యావ్యవస్థకు మూలస్తంభాలైన ఉపాధ్యాయులను తయారు చేసే ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. పాఠశాల విద్యావ్యవస్థ పునాది బలంగా ఉంటేనే కళాశాల భవనం నాణ్యంగా ఉంటుంది. విద్యలో బలహీనత కొనసా గితే విద్యార్థులకే కాదు, సమాజానికి కూడా నష్టమే వాటిల్లుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా విద్యారంగంలోని ఖాళీలను గుర్తించి జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలి. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేసి, విద్యలో ప్రమాణికతను పెంచడం ద్వారా మాత్రమే అభివృ ద్ధిని సాధించగలమన్న విషయాన్ని పాలకులు గమనంలో పెట్టుకోవాలి.