నవతెలంగాణ-భద్రాచలం
నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. బుధవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొని, జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగ యువతీ, యువకుల అభిప్రాయాలను వారి మనోగతాన్ని తెలుసుకొని, ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తూ జీవన భృతి పెంపొందించుకోవడానికి ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందని, తక్కువ వేతనం వస్తుందని ఎవరూ నిరుత్సాహ పడకూడదని ఈ ఉద్యోగం చేసుకుంటూ వారి విద్యా అర్హతను బట్టి ప్రయత్నిస్తే తప్పకుండా మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన యువతీ, యువకులు యూత్‌గా ఏర్పడి వారు కోరుకున్న రంగాలలో ముఖ్యంగా టెక్నాలజీ, మొబైల్ రిపేరింగ్, కుట్టు శిక్షణ, ఎలక్ట్రీషియన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ సంబంధించిన శిక్షణలు ఇచ్చి వారు స్వతహాగా జీవించడానికి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అలాగే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి గ్రూపులో 10 మంది సభ్యులు ఉండాలని వారికి 60 శాతం సబ్సిడీ 10శాతం బెనిఫిషర్ కంట్రిబ్యూషన్ 30శాతం బ్యాంకు లోన్ ద్వారా పరిశ్రమలు స్థాపించుకొని వారి కుటుంబాలను పోషించుకోవడమే గాక పదిమందికి ఉపాధి కల్పించడానికి దోహద పడతారని అటువంటి పథకాల కోసం గిరిజన యువత ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు యువతీ, యువకులు పాల్గొన్నారు.