– ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు
– కడ్తాల్ మండల కేంద్రములో జీపీ కార్మికుల బిక్షాటన
– 30వ చేపడుతున్న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వర్కర్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు పిలుపునిచ్చారు. జీఓ నెంబర్ 51ని రద్దు చేయాలని కోరుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతత్వంలో గ్రామ పంచాయతీ కార్మికులు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ ఆమనగల్ ఏరియా కన్వీనర్ జే.పెంటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం రూ.26,000లు అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 51 ని రద్దు చేయడంతో పాటు పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న జరుప తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల అధ్యక్షులు భవాని కుమార్, చెన్నయ్య, అంజయ్య, మహేష్, వెంకటమ్మ, సరస్వతి, చంద్రకళ, మంజుల, హంస, శివ, నీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.