– పీఎఫ్ చందాదారుల్లో పతనం
– ఆగస్ట్‌లో 13.3 శాతం క్షీణత
న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి రంగం కుదేలు అవుతోంది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు కొత్త ఉద్యోగాల సృష్టికి ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వకపోవడంతో సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాలు తగ్గాయి. ప్రస్తుత ఏడాది ఆగస్టులో కొత్త ఉద్యోగాల నమోదులో తగ్గుదల చోటు చేసుకుందని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) గణంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జులైతో పోల్చితే గడిచిన ఆగస్ట్‌లో కొత్త ఉద్యోగాల కల్పన 13.3 శాతం పతనం చోటు చేసుకుంది. జులైలో 10.6 లక్షల కొత్త ఈపీఎఫ్ చందాదారులు నమోదు కాగా.. ఆగస్ట్‌లో ఇది 9,25,984కు పడిపోయింది. ఈపీఎఫ్‌ఓ శుక్రవారం విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం.. జులైలో 2,85,424 మహిళ సబ్‌స్రయిబర్లు నమోదు కాగా.. ఆగస్ట్‌లో 26.7 శాతం పతనమై 2,43,510గా ఉన్నారు. జులైలో 18-28 ఏండ్ల యువ చందాదారులు 7,26,415తో 67.97 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆగస్ట్‌లో 6.32 లక్షలతో 68.3 శాతం వాటాను కలిగి ఉన్నారు. పేరోల్ డేటా సంఘటిత రంగంలో ఉపాధి కల్పనను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) కూడా దేశంలో ఉపాధి పోకడలను విశ్లేషించడానికి ఈపీఎఫ్‌ఓ డేటాను ఉపయోగిస్తుంది. మరోవైపు గడిచిన ఆగస్ట్‌లో ఈపీఎఫ్ నికర చందాదారులు 0.8 శాతం పెరిగి 16.9 లక్షలుగా నమోదయ్యారు. జులైలో ఇది 16.8 లక్షలుగా ఉంది. ప్రస్తుత పండగ సీజన్‌లో కొత్త చందాదారుల్లో పెరుగుదల చోటు చేసుకోవచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ ప్రతినిధి రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం.. ఆగస్టులో దేశంలో నిరుద్యోగం జులైలో 7.9 శాతం నుంచి 8.1 శాతానికి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయిందని పేర్కొంది.