– చాట్‌జిపిటి సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్
న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఏఐ) వల్ల ఉద్యోగాలు ఊడటం ఖాయమని చాట్‌జిపిటి సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఎఐతో ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయని స్వయంగా ఆల్ట్‌మన్ పేర్కొనడం ఆందోళకరం. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన చాట్‌జిపిటి అనూహ్య ఆదరణ సొంతం చేసుకుందన్నారు. మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగని ఎఐ టూల్స్ అన్నీ పరిపూర్ణం కావన్నారు. వాటికీ కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. అట్లాంటిక్ సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆల్ట్‌మస్ మాట్లాడుతూ.. మానవాళిపై ఎఐ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. ఎఐ గణనీయమైన పురోగతిని చూపించినప్పటికీ, ఇది సమాజానికి సవాళ్లను కూడా విసురుతోందన్నారు. ఉపాధి మార్కెట్‌కు అంతరాయం కలగకకుండా సానుకూలంగా ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. చాట్‌జిపిటి కంటే మరింత శక్తివంతమైన ఎఐని సృష్టించే సామర్థ్యం ఓపెన్ ఎఐకి ఉందని ఆల్ట్ మాన్ వెల్లడించాడు. కానీ ఆ టూల్స్ ఇప్పట్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఊహించని పరిణామాలను ఎదుర్కోవడం కష్టంగా ఉందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల భారత్ కూడా ఉత్సాహాంగా ఉండటం ప్రశంసనీయమన్నారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్‌కు సపోర్ట్ ఇవ్వడానికి ఓపెన్‌ఎఐ ప్రణాళికలను రూపొందించామన్నారు. కత్రిమ మేధ కేవలం మానవ ప్రయత్నాలకు తోడ్పడుతుందని, ఉద్యోగాలను భర్తీ చేయదని కొద్ది మంది నిపుణులు అభిప్రాయపడుతుండగా.. ఆల్ట్‌మన్ మాత్రం ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయని స్పష్టం చేయడం ఆందోళకరం.