ఉద్యోగాలు ఉత్తమాటలే.!

– పెరుగుతున్న నిరుద్యోగం
– పీఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే నివేదిక
– కేంద్రశాఖల్లో భారీగా ఖాళీలున్నా పట్టించుకోని బీజేపీ సర్కార్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉపాధి లేక రోడ్డున పడుతున్న యువత సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4 శాతం ఉంది. స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించిన తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో అత్యల్ప నిరుద్యోగిత రేటు చండీగఢ్‌లో 5.6 శాతంగా ఉంది, ఆ తర్వాత ఢిల్లీలో 5.7 శాతం ఉంది. అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ద్వీపంలో అత్యధికంగా నిరుద్యోగం 33 శాతం, లడఖ్‌లో 26.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24 శాతం ఉన్నట్లు డేటా స్పష్టం చేసింది. పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు రాజస్థాన్‌లో 23.1 శాతం, ఒడిశాలో 21.9 శాతంగా ఉంది. అందుబాటులో ఉన్న సమయ వ్యవధిలో లేబర్‌ ఫోర్స్‌ డేటా లభ్యతకు సంబంధించిన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఏప్రిల్‌ 2017లో పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ని ప్రారంభించింది. ఇంతకుముందు, ఐదు వార్షిక నివేదికలు జులై 2017-జూన్‌ 2018, జులై 2018-జూన్‌ 2019, జులై 2019-జూన్‌ 2020, జులై 2020-జూన్‌ 2021, జులై 2021-జూన్‌ 2022 మధ్యకాలంలో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ లో సేకరించిన డేటా ఆధారంగా రూపొందించింది. ఇప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ జులై 2022-జూన్‌ 2023 మధ్య కాలంలో నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ఆధారంగా ఆరో వార్షిక నివేదికను విడుదల చేసింది. నమూనాలకు సంబంధించి సమాచార సేకరణ కోసం ఫీల్డ్‌ వర్క్‌ జులై 2022-జూన్‌ 2023 కాలానికి సంబందించినది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి..తొమ్మిదేండ్లు పూర్తయినా..కేంద్రశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటంలేదని నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.