– ప్రభుత్వ శాఖల్లో ఏండ్ల తరబడి ఖాళీలు : డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శి హిమాగ్నిరాజ్ భట్టాచార్య
నవతెలంగాణ-హనుమకొండ
దేశంలోని నిరుద్యోగం పెరుగుతున్నా ఉద్యోగాలు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శి హిమాగ్నిరాజ్ భట్టాచార్య అన్నారు. హనుమకొండ హరిత కాకతీయ హౌటల్లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ‘విద్య- ఉపాధి’పై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికీ రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తామని ఒక్క రూపాయీ వెనక్కి తీసుకురాలేదని చెప్పారు. జీఎస్టీ వల్ల ప్రజలపై భారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపయోగపడే ఏ పనీ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఏండ్ల తరబడి ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. కేంద్రం విధానాలు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయకపోతోందని, ప్రజలు ధరల భారంతో అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో యువతకు జరిగిన ఉపయోగం శూన్యమని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీలతో సరిపుచ్చుకుందని విమర్శించారు. ఏ ఒక్క నోటిఫికేషన్ సక్రమంగా నిర్వహించలేకపోగా.. కోర్టు కేసులతో పెండింగ్‌లో పడిపోయాయని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలు ఒక్కటేనని, వాటిని ఓడిస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ఉపాధి కోసం జరుగుతున్న ఉద్యమంలో యువత భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన వహించగా.. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి బషీర్, జి.తిరుపతి నాయక్, గడ్డం, రోషన్ బేగం, వెంకటేష్, సహాయ కార్యదర్శులు గొడిశాల కార్తీక్, జగన్, కొంటూ సాగర్, డి.సాంబమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, కార్యదర్శి దోగ్గెల తిరుపతి, ఉపాధ్యక్షులు మంద సుచందర్, సహాయ కార్యదర్శులు మంద సురేష్ ఓర్సు చిరంజీవి, చిట్యాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.