జోడీ నం.1

Pair No.1– ప్రపంచ నం.1గా సాత్విక్‌, చిరాగ్‌
– అగ్రస్థానానికి చేరుకున్న డబుల్స్‌ స్టార్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకీరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఎన్నో చారిత్రక విజయాలతో భారత బ్మాడ్మింటన్‌ రారాజులుగా వెలుగొందుతున్న సాత్విక్‌,చిరాగ్‌ జోడీ.. తాజాగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌ విభాగంలో పసిడి పతకం సాధించిన సాత్విక్‌, చిరాగ్‌ తొలిసారి ప్రపంచ నం.1గా నిలిచారు. భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ (ఉమెన్స్‌ సింగిల్స్‌), కిదాంబి శ్రీకాంత్‌ (మెన్స్‌ సింగిల్స్‌) మాత్రమే ఇప్పటివరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నం.1గా నిలిచారు. ఈ ఏడాది 18 టోర్నమెంట్లలో పోటీపడిన సాత్విక్‌, చిరాగ్‌లు 92411 పాయింట్లు కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన ఇండోనేషియా జోడీ కంటే 2000 పాయింట్ల ముందంజలో మన జోడీ కొనసాగుతుంది. చైనా, మలేషియా, దక్షిణ కొరియా షట్లర్లు టాప్‌-5లో నిలిచారు. ఆసియా క్రీడల ఆరంభానికి ముందు కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ నం.2 అందుకున్న సాత్విక్‌, చిరాగ్‌.. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఫైనల్లో దక్షిణ కొరియా స్టార్స్‌పై వరుస గేముల్లో అలవోక విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.