చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఒక నియంత అని అమెరికా అధ్యక్షుడు మంగళవారం నోరు పారవేసుకున్నాడు. విషమించిన సంబంధాల పునరుద్దరణలో భాగంగా తమ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ను బీజింగ్ పంపిన బైడెన్ అతగాడు స్వదేశం తిరిగి రాగానే అలా ఎందుకు మాట్లాడినట్లు? నోరా చెంపకు చేటు తేకే, కాలు జారితే తీసుకోవచ్చు గానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమనే సామెతల గురించి అగ్రరాజ్య అధినేత, ఎనభై సంవత్సరాలు దాటిన జో బైడెన్‌కు తెలియదా? లేక ముదితో మతి తప్పిన మాటలుగా భావించాలా? ఏ వంకా లేకపోతే డొంకను పట్టుకు ఏడ్చాడట వెనుకటి కెవడో. జనవరిలో వాతావరణ పరిశోధనల కోసం చైనా వదిలిన ఒక బెలూన్ అమెరికా, కెనడాల వైపు వెళ్లింది. దాన్ని గూఢచర్యం కోసం పంపినట్లు ఆరోపించిన అమెరికా కూల్చివేసేందుకు శత్రుదేశం మీద దాడికి దిగిన మాదిరి యుద్ధ విమానాలను పంపి పెద్ద హడావుడి చేసింది. జనం ఆ ఉదంతాన్ని మరచిపోయారు. డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ సదరు బెలూన్ కూల్చివేయటంతో షీ జిన్‌పింగ్ కిందు మీదులయ్యాడని, దాన్ని పంపినట్లు అతనికి తెలియదని, తానీ అంశాన్ని సీరియస్‌గా చెబుతున్నానని, నియంతలకు అలాంటి అంశాలు తెలియవని బైడెన్ అన్నాడు.
అసలు డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణకు చైనా బెలూన్ కూల్చివేత ప్రస్తావనకు సంబంధం ఏమిటి? ‘బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు’ అసందర్భప్రలాపిగా బైడెన్ తనను తానే ప్రదర్శించుకున్నాడు. చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెబుతున్న పెద్దమనిషి ఇలా మాట్లాడటం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నది ఒక స్పందన. బైడెన్ మాట్లాడుతున్న సమయంలో తాము కూల్చివేసిన చైనా బెలూన్ ఉదంతం గురించి చెప్పుకోవటాన్ని ముగించాలని బ్లింకెన్ ఒక టీవీ ఛానల్‌తో చెప్పాడు. కావాలనే అదే ఉదంతాన్ని ప్రస్తావించి జో బైడెన్ మాట్లాడినట్లు స్పష్టం అవుతోంది. దీని వెనుక రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పద్ధతిగా ఉంటే మేమూ అలాగే ఉంటాం, లేకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరి తమ స్పందన ఉంటుందని, అమెరికా ఉడుత ఊపులకు జంకేది లేదని బ్లింకెన్ బీజింగ్ పర్యటనలో చైనా నేతలు స్పష్టం చేసినట్లు వార్తల సారం. అహం దెబ్బతిని ఉక్రోషంతో ఏదో ఒక సాకుతో వదరుబోతుతనాన్ని ప్రదర్శించటం ఒకటైతే, రెండవది, అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీని సంతుష్టీకరించేందుకు, సంతోష పెట్టేందుకు కూడా అలా మాట్లాడి ఉండాలి. లడఖ్ సరిహద్దులోని గాల్వన్ ఉదంతాలకు ముందు నుంచే తమతో జట్టుకట్టాలని నరేంద్రమోడీ మీద ఒత్తిడి తెస్తున్న అమెరికా ఘర్షణల సందర్భంగా తప్పుడు సమాచారమిచ్చి చైనా-భారత్ మధ్య దూరాన్ని మరింతగా పెంచాలని చూసింది. దాంతో తమ ఒడిలోకి వచ్చినట్లే కనిపించిన మోడీ ఉక్రెయిన్ సంక్షోభంలో తటస్థంగా ఉంటామన్న వైఖరితో అమెరికా ఆశాభంగం చెందింది. మింగా కక్కలేని స్థితిలో అయినను పోయిరావలె అన్నట్లుగా చేయని యత్నం లేదు. బెదిరింపులు-బుజ్జగింపుల ఎత్తుగడలో భాగంగా మరోసారి ప్రయత్నించి చూద్దాం అన్నట్లుగా చైనా నేతను నిందిస్తే మోడీ తమ చంకనెక్కుతారన్న చౌకబారు ఎత్తుగడ బైడెన్ మాటల వెనుక ఉందన్నది స్పష్టం. ప్రతి బెలూన్ గురించి ఏ దేశాధినేతకూ తెలియదు, అవసరమూ లేదు. అది చైనా నిఘా బెలూన్ అని జో బైడెన్‌కు వెంటనే తెలిసి ఉంటే కూల్చివేసేందుకు వారం పాటు ఎందుకు తటపటాయించినట్లు? ఆ బెలూన్ ఉదంతాన్ని సాకుగా చూపి నిరసన పేరుతో ఫిబ్రవరిలో జరపాల్సిన బీజింగ్ టూర్‌ను బ్లింకెన్ రద్దు చేసుకొని ఈ నెలలో వచ్చాడు. జో బైడెన్ ఆ ఉదంతాన్నే సాకుగా చూపి షీ జిన్‌పింగ్‌పై నిందలు వేశాడు. నియంత అన్న వారితో ఏమి చర్చించాలని తన మంత్రిని చైనా పంపినట్లు?
ఉక్రెయిన్‌కు మద్దతుగా నేరుగా రాలేదని అనుకుంటు న్నారేమో తైవాన్ అంశంలో ఊరుకునేది లేదని గతంలో జో బైడెన్ అన్నాడు. తమ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకుంటే మాడు పగలగొడతామని షీ తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ నేతను నియంతగా వర్ణించిన బైడెన్ మంచీ మర్యాద తెలియని వ్యక్తిగా చైనా ప్రతినిధి వర్ణించాడు. బైడెన్ మాటలు వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాయి. దౌత్య మర్యాదలను తీవ్రంగా ఉల్లంఘించటమే. చైనా రాజకీయ మర్యాదను అతిక్రమించటమే అన్నాడు. వదరుబోతుతనం ప్రపంచ రాజకీయాలలో నష్టం కలిగించేదే తప్ప లబ్ది పొందిన ఉదంతమేదీ లేదు. అమెరికా ఉడుకుమోత్తనం మరోసారి వెల్లడైంది.