పద్మశ్రీ అవార్డు విషయంలో బీజేపీ ద్వంద వైఖరి ఖండిస్తున్నాం: జోగురామన్న

We condemn BJP's double stance on Padma Shri award: Joguramanna– బండి సంజయ్ చేసిన వాక్యాలు ఉపసంహరించుకోవాలి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ వాసి ప్రజాయుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డుపై కేంద్రం మంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలను ఉపసంహరించుకోవాలని, పద్మశ్రీ అవార్డు ఎంపిక విషయంలో బిజెపి నాయకుల ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా యుద్ధ నౌకగా కీర్తి గడించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటే.. బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. దేశవ్యాప్త గుర్తింపు సాధించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వబోనడమనడం, బిజెపి పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేదని, వారి మధ్య ఉన్న విభేదాలను బయట పడుతున్నాయన్నారు. బిజెపిలో పొంతన లేకుండా మాట్లాడుతున్న ఆడియోలను, వీడియోలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పద్మశ్రీ అవార్డు అనేది బిజెపి నుంచి ఇస్తున్న అవార్డు కాదని.. ఇది జాతీయ అవార్డు అని పేర్కొన్నారు. జననాట్యమండలి ద్వారా ప్రజలను చైతన్యపరచిన ఘనత గద్దర్ కు దక్కుతుందన్నారు. చాలా సభల్లో ఆయనను బిజెపి నాయకులే అభినందించారని గుర్తు చేశారు. ఇకనైనా ద్వంద్వ వైఖరి మాని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులకు పురస్కారాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని, గద్దర్ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, బట్టు సతీష్, కడదరపు దేవదాస్, అడప తిరుపతి, అసిఫ్, అశోక్, మహేష్ పాల్గొన్నారు.