నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త అనే తారతమ్యం లేకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఐక్యంగా పనిచేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.నల్లగొండ పట్టణంలోని 1వ వార్డు పానగల్ కు చెందిన 40 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చిన విజయవంతం చేయాలని అన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి పనిచేస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు,ఇండస్థలాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పానగల్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.