– అటకెక్కిన ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు
– కొన్ని కేసుల్లో నత్తనడక నడుస్తున్న విచారణ
– కక్ష సాధింపు భయంతోనే కమలం గూటికి ప్రతిపక్ష నేతలు
న్యూఢిల్లీ : వారం రోజుల క్రితం కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితల ముంబయిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీని ఓ ‘వాషింగ్ మిషన్’గా ఆయన అభివర్ణించారు. ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఏ ప్రతిపక్ష నాయకుడైనా తన గూటికి చేరాలని అనుకుంటే బీజేపీ వెంటనే గ్రీన్‌సిగల్ ఇస్తోందని ఆయన వ్యాఖ్యా నించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ‘అనుబంధ సంస్థలు’గా వర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఓ అడుగు ముందుకు వేసి ఈ సంస్థలను బీజేపీ ‘జవాన్లు’గా అభివర్ణించారు. తమపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందేమోనన్న భయంతో పలువురు ప్రతిపక్ష నాయకులు బీజేపీలోనో లేదా దాని మిత్రపక్షాలలోనో చేరిపోతున్నారు. గత కొన్ని నెలలుగా బీజేపీలో చేరుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. వీరంతా కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా నీడలో ఉన్న వారే. వారిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ వారిలో కొందరు నేతల సమాచారం సేకరించింది. ఆ వివరాలు…
మహారాష్ట్రలో…
యావత్మాల్-వాషిమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భావనా గవాలీపై 2020లో ఈడీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు మోపింది. కొద్ది నెలల తర్వాత ఆమె సన్నిహితుడు సయీద్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం గవాలీని పలుమార్లు విచారణకు పిలిచారు. ఈ కేసులో ఈడీ ఐదుగురిపై ఛార్జిషీటు నమోదు చేసింది. గవాలీతో సంబంధమున్న ట్రస్ట్‌ను కూడా అందులో చేర్చింది. 2022 జూలైలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరాలని గవాలీ నిర్ణయించుకున్నారు. ఆమెను లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా కూడా ప్రకటించారు. అప్పటి నుండి ఈడీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేయడం కానీ, గవాలీని విచారణకు పిలవడం కానీ జరగలేదు.
ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ 2021లో ఆయనకు ఓ లేఖ రాశారు. బీజేపీతో జట్టు కట్టాలని అందులో సూచించారు. అలా చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపుల నుండి పార్టీకి రక్షణ లభిస్తుందని సలహా ఇచ్చారు. ఆ సమయంలో సర్నాయక్, ఆయన కుటుంబం ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. ఈడీ ఆయన్ని ప్రశ్నించడంతో పాటు ఆయన సంస్థకు చెందిన 112 ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. 2022లో ఠాక్రే శిబిరం నుండి విడిపోయి బీజేపీతో చేతులు కలపాలని ఏక్‌నాథ్ షిండే నిర్ణయించుకోగానే సర్నాయక్ వెంటనే పార్టీ మారారు. సర్నాయక్ ఎప్పుడైతే షిండే వెంట నడిచారో అప్పటి నుండి ఆయనపై దాఖలైన కేసు విచారణ నెమ్మదించింది.
మనీ లాండరింగ్ కేసులో 2023 మార్చిలో హసన్ ముష్రిప్ నివాసం, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. ముష్రిప్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బీజేపీ నేత కిరిత్ సోమయ్య ఆరోపణలు చేశారు. ముష్రిప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాత్కాలిక బెయిల్ పొందారు. అయితే ఆయన అరెస్ట్ అనివార్యమని తేలిపోయింది.
2023 జూలైలో ఎన్సీపీని చీల్చి బీజేపీతో జత కట్టాలని అజిత్ పవార్ నిర్ణయించుకో వడంతో ముష్రిప్ కూడా ఆ గ్రూపులో చేరిపోయారు. అందుకు ప్రతిఫలంగా ఆ కేసులో తదుపరి విచారణ జరిగినట్లు లేదా ఆయన నివాసంలో సోదాలు జరిగినట్లు వార్తలేవీ రాలేదు. కేసు మాత్రం ఇప్పటికీ పెండింగులోనే ఉంది.
ఫెమా ఉల్లంఘన కేసులో ప్రముఖ శివసేన నాయకురాలు యామినీ జాదవ్ ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2022 ఏప్రిల్‌లో 41 ఆస్తు లను ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. ఆమెను ఈడీ అధికారులు విచారిం చారు కూడా. ఆ తర్వాత యామిని తన భర్తతో సహా షిండే శిబిరంలో చేరిపోయారు. అప్పటి నుండి కేసు విచారణ నత్తనడక నడుస్తోంది.
మహారాష్ట్రలో సీనియర్ ఎన్సీపీ నేత, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజబల్ కూడా అజిత్ పవార్ శిబిరం గూటికి చేరారు. రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు కట్టబెట్టిన ఉదంతంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ కూడా జరుగుతోంది. మనీ లాండరింగ్ కేసులో సైతం ఆయన నిందితుడు. ఈ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది కూడా. అజిత్ పవార్ వెంట వెళ్లిన తర్వాత ఛగన్‌పై నమోదైన కేసుల్లో విచారణ నెమ్మదించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని వీడడానికి కారణాలేవీ ఆయన చెప్పనప్పటికీ పదిహేను సంవత్సరాలుగా ఆయన సీబీఐ కేసును ఎదుర్కొంటున్నారు. ఈడీ కూడా ఈ కేసును విచారించింది. ఆయనను నిందితుడిగా చేర్చింది. కేసులో ఇప్పటి వరకూ ఈడీ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఛార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబా సిద్ధికి పార్టీకి రాజీనామా చేసి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. సిద్ధికీ పైన కూడా ఈడీ కేసు ఉంది. ఇక ఎన్సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్‌పై కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పలు దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. అయితే ఇవన్నీ దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉండడంతో విచారణలు ముందుకు సాగడం లేదు. ఆయన ఎన్సీపీని వీడి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీంతో సమీప భవిష్యత్తులో ఆ కేసులు తేలేలా కన్పించడం లేదు.
ఇతర రాష్ట్రాల్లో….
గోవాలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలేమవోపై ముడుపుల కేసులు ఉన్నాయి. వీటిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి. 2015 నుండి విచారణ కొనసాగుతోంది. 2021లో విచారణ వేగవంతం అవడంతో కామత్, మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దూకి బీజేపీలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారిని ఓ కేసులో ఈడీ అనేక సార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక కేసుల సంగతి చెప్పేదేముంది ?
ఆంధ్రప్రదేశ్‌లో…
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి 2021 జూన్‌లో బీజేపీలో చేరారు. వీరిద్దరూ పారిశ్రామికవేత్తలే. ఐటీ, సీబీఐ, ఈడీ నిఘా నీడలో ఉన్న వారే. బీజేపీలో చేరడానికి కొద్ది నెలల ముందు ఆ పార్టీ ఎంపీ, ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వీరిద్దరినీ ‘ఆంధ్ర మాల్యాలు’గా అభివర్ణించారు. వారిద్దరిపై తగిన చర్యలు తీసుకోవాలం టూ రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఆ నేతలపై కేసుల విచారణ అటకెక్కినట్లే కన్పిస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పైన, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పైన అనేక అవినీతి కేసులు ఉన్నాయి. జగన్‌పై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేయగా చంద్రబాబుపై సీఐడీ కేసులు పెట్టింది. ఆయనను గత సంవత్సరం అరెస్ట్ చేసి జైలులో ఉంచింది.
ఈ నేపథ్యంలో అటు జగన్, ఇటు చంద్ర బాబు… ఇద్దరూ ఇప్పుడు బీజేపీ ప్రాపకం కోసం ప్రయ త్నిస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతు లేకుండా చంద్రబాబుపై జగన్ కేసులు నమోదు చేయలేరని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిం చారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.