– అజర్‌బైజాన్ రాజధానిలో ఆరంభమైన వాతావరణ చర్చలు
బాకూ : ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ, 2024 సంవత్సరం అత్యధిక వేడిమి గల సంవత్సరంగా నమోదవచ్చని హెచ్చరికలు వెలువడిన తరుణంలో వాతావరణ మార్పులపై చర్చలు అజర్‌బైజాన్ రాజధాని బాకూలో సోమవారం ప్రారంభమయ్యాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన వాతావరణ నిధిపై తక్షణమే చర్చ జరగాల్సిన ఆవశక్యత కనిపిస్తోంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని మళ్లీ ట్రంప్ అధిష్టించడంతో ఈ చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేసే చారిత్రక పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలగుతుందనే భయాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో వాతావరణ చర్చలు మళ్ళీ గాడి తప్పడాన్ని భరించే పరిస్థితి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను నమోదు చేసిన ఈ దశాబ్దం
2015-2024 దశాబ్ద కాలం అత్యధిక వేడిమి గల దశాబ్ద కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. ఆరు అంతర్జాతీయ డేటాబేస్‌ల ప్రాతిపదికన సోమవారం వెలువరించిన కొత్త నివేదికలో ఈ విషయం వెల్లడించింది. తీవ్రమైన వాతావరణ మార్పులతో మంచు ఫలకాలు కరిగి నీరవడం, సముద్ర మట్టాలు పెరగడం, ఫలితంగా పలు దేశాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడం జరుగుతోందని పేర్కొంది. పారిస్ వాతావరణ ఒప్పంద లక్ష్యాలు గొప్ప ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించింది. ప్రతి దేశమూ 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దిగువకే ఉష్ణోగ్రతలను కట్టడి చేసేందుకు కృషి చేయాల్సి వుంది. కానీ ఇప్పటికే 2024 సంవత్సరం 1.5 డిగ్రీలను దాటేసిందని ఇయు వాతావరణ పర్యవేక్షక సంస్థ కొపర్నికస్ హెచ్చరించింది.
సంయుక్త కార్యాచరణే కీలకం
ప్రపంచ ఆహార భద్రతకు ఈ వాతావరణ మార్పులు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, పెను తుపానులు, భారీ వర్షాలు, తరచుగా సంభవిస్తున్న వరదలు, కరువు కాటకాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను, ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. మానవ ఆరోగ్యాన్ని అనేక రకాలుగా దెబ్బ తీస్తున్నాయి. అంతేకాదు కీలకమైన మౌలిక వసతులను, జీవనోపాధులను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం సమర్ధవంతమైన చర్యలు తీసుకుని తక్షణమే అమలు చేయని పక్షంలో లక్షలాదిమంది ప్రజలు క్షుద్భాధ వైపునకు నెట్టబడతారు.
ఇప్పటికే వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులతో పంట దిగుబడులు తగ్గిపోయాయి. దీనివల్ల ఆఫ్రికా ఖండం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. కొన్ని ఆఫ్రికా దేశాల్లో వాతావరణ మార్పులు పంట దిగుబడులను దాదాపు 40శాతం మేరా ప్రభావితం చేశాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో సగటు పంట దిగుబడి 20నుండి 30శాతం తక్కువగా వుంటోంది. పశు,వ్యవసాయ రంగాల్లో కూడా ఉత్పాదకత బాగా పడిపోయింది. పైగా వ్యవసాయ రంగంలో చీడపీడలను, తెగుళ్ళను నియంత్రించడం కూడా కష్టమైపోతోంది. కొత్త కొత్త వైరస్‌లు, క్రిమి కీటకాలు పుట్టుకొస్తున్నాయ. కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. పెరుగుతున్న సముద్ర మట్టాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచం సాహోసేతమైన వాతావరణ కార్యాచరణకు ఉపక్రమించాల్సిన ఆవశ్యకత నెలకొంది. వ్యవసాయంతో సహా అన్ని రంగాలు కాలుష్య కారక వాయువులను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి వుంది. పంటలను, సాగు పద్దతులను వైవిధ్యభరితంగా రూపొందించాల్సి వుంది. ఇందుకోసం అధునాతన సాంకేతికతలను ఉపయోగించాలి. ఇవి ఆఫ్రికా వంటి దేశాల్లో చిన్న రైతులకు కూడా అందుబాటులో వుండేలా చూడాలి. అలాగే ఆహార మార్కెట్ల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. నిరుపేద దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే గ్రామీణ నిరుపేద ప్రజానీకానికి ఉపాధి కల్పనకు కొత్త అవకాశాలను కల్పించాలి. వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం కుదేలవుతున్న తరుణంలో వీరు వ్యవసాయేతర రంగాల వైపు దృష్టి సారించేలా చూడాలి. తక్కువ, ఒక మోస్తరు ఆదాయ దేశాల్లో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాల్సి వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పైన పేర్కొన్న రంగాల్లో సత్వర కార్యాచరణ చేపట్టడానికి మరిన్ని నిధులు అవసరం. ఇటువంటి సమయంలో అధికాదాయ దేశాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను గుర్తెరగాలి. తక్కువ, మధ్య తరగతి ఆదాయ దేశాలకు సాయమందించాలి. బలమైన రీతిలో అంతర్జాతీయ సహకారం వుంటేనే ఆకలి బాధలు లేని ప్రపంచం సాకారమవుతుంది.