– సహకార శాఖకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏండ్ల తరబడి ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంటూ బ్రహ్మాండభేరి గోపరాజు ఇతరులు వేసిన పిటిషన్ తరఫున న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదించారు. ప్రస్తుత కమిటీ సభ్యుల జోక్యం లేకుండా తుది ఓటర్ల జాబితాను రెడీ చేయాలని సహకార సంఘ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికతో ప్రమేయం లేకుండా ఓటర్ల లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించింది.
ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ల పరిశీలించాలి
కార్మిక శాఖలోని ఖాళీ పోస్టుల భర్తీలో కులాల వారీ రిజర్వేషన్లతోపాటు ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలన చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ శాఖలోని పోస్ట్‌లను టీజీ సర్వీస్ కమిషన్ నియామాకాల ప్రక్రియను చేపట్టింది. థర్డ్ జెండర్ కేటగిరీకి రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లోని 22ను కొట్టేయాలంటూ ట్రాన్స్‌జెండర్ బి. ఏడుకొండలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ పి సుజరు పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది.