జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి 

Journalist Yogireddy's family should be supported– జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్
– కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నివాళ్ళర్పించి
– జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆర్ధిక భారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జర్నలిస్ట్ యోగి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్ అన్నారు. యోగి రెడ్డి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి  జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అర్ అండ్ బీ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళ్ళు అర్పించి సానుభూతి వ్యక్తం చేశారు.
జర్నలిస్ట్ లోకాన్ని కలచివేచిన ఆత్మహత్య ఘటన 
ఈ సందర్భంగా జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్ మాట్లాడుతూ.. అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజా సమస్యలపై పోరాడిన యోగి రెడ్డి ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టు లోకాన్ని కలచివేసిందని అన్నారు. కనీసం ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో యోగి రెడ్డి కుటుంబం ఉండడం బాధాకరమని అన్నారు. సమాజ హితం కోసం ప్రతిరోజు అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల హక్కులను కాపాడాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట కాలయాపన చేసిందని, ఈ ప్రభుత్వమైనా యోగి రెడ్డి ఆత్మహత్యతో అయిన స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్, కో కన్వీనర్ బీర్కూర్వార్ వెంకటేష్, జర్నలిస్టులు సురేష్, నరేష్, రఘు, సారంగపాణి, సందేశ్, అశోక్, లెనిన్, సుధాకర్, సుభాష్, పేరోజ్, అస్మాత్, నిలేష్, కీజర్, హామిన్, అరుణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్, మహేష్, ప్రవీణ్ నాయకులతో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్ లు, కెమెరమెన్ లు  పాల్గొన్నారు.