నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
చదువుకోవాలన్న తపన ఉండి చదువుకునే అవకాశం లేని విద్యార్థినిని సిద్దిపేట అర్బన్ మండల జర్నలిస్టులతో పాటు సీనియర్ జర్నలిస్టులు సంజీవరెడ్డి, కత్తుల శ్రీనివాస్, రంగదాంపల్లి శ్రీనివాస్‌లు చేరదీసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసి హాస్టల్‌కు, చదువుకు కావలసిన సామాగ్రిని గురువారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన ఐదవ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థినికి తల్లి చనిపోవడంతో ఇంట్లో పట్టించుకునే వారు లేకపోవడంతో ఒంటరి అయిపోయిందని తెలిపారు. చదువుకోవాలన్న తపన ఉండి అవకాశం లేకపోవడంతో విద్యార్థినిని చేరదీసినట్లు తెలిపారు. కావలసిన సామాగ్రిని ఇప్పించి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని చేర్పించినట్లు తెలిపారు. విద్యార్థినికి ఒక అన్నయ్య ఉండగా అతడు కూడా హాస్టల్లోనే ఉంటున్నాడు. తండ్రి ఉన్నప్పటికీ బాధ్యత రహితంగా వ్యవహరించడంతో అమ్మాయికి చదువుకోలేని స్థితి నెలకొందని తెలిపారు. జర్నలిస్టులుగా సామాజిక బాధ్యతతో ఉంటూనే విద్యార్థిని చేరదీసి చదివించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అర్బన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్, ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, కార్యదర్శి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి, గౌరవ సలహాదారు రమేష్, కోశాధికారి సంతోష్, ఆఫీస్ ఇంచార్జ్ శ్రీనివాస్, శ్రీకాంత్, మహేష్, కె శ్రీనివాస్, నరేష్, అంకుష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇంద్రశేఖర్, సాయి, చందు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.