జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్దం కావాలి 

– సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్
– ఫెడరేషన్ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి
– సంఘానికి సభ్యత్వమే కీలకం
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్దం కావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మరిన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని, ఈ విషయంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సమస్యలపై పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం సిద్దం కావాలని సూచించారు. ఆదివారం నిజామాబాద్ పట్టణంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో గానీ,దేశంలో గానీ రాను రాను జర్నలిస్టుల హక్కులు హరింపబడుతున్నాయని, పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని, జీవో 239 సమీక్ష పేరుతో కమిటీ వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం, హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ లు మాట్లాడుతూ, ఫెడరేషన్ బలోపేతానికి ప్రతి జిల్లా, నియోజకవర్గాల్లో జర్నలిస్టులంతా కలిసిరావాలని, సభ్యత్వ నమోదు ద్వారా సంఘాన్ని బలోపేతం చేసి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
అడ్ హాక్ కమిటీ ఎన్నిక…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిజామాబాద్ జిల్లా అడ్ హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. కన్వీనర్ గా కుంచం శ్రీనివాస్(ప్రజా జాగృతి), కో-కన్వీనర్లుగా పానుగంటి శ్రీనివాస్(జన ప్రజావాణి),రామచంద్రారెడ్డి(సాక్షి), కోరి రాకేష్(ఆంధ్రజ్యోతి),రాజేందర్(నమస్తే తెలంగాణ),లక్ష్మణ్, అనిత (నవ తెలంగాణ), పరమేశ్వర్(ప్రజాదర్బార్), శ్రీకాంత్ (ఆదాబ్ హైదరాబాద్),రాజేందర్ పటేల్, టి. రాజేష్ తదితరులు ఎన్నికయ్యారు. అడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా మహాసభ, నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను జరపాలని సమావేశం తీర్మానించింది.