సంత లేక చింత..!

– ఇతర జిల్లాలకు వెళ్తున్న మండల వాసులు
– రాత్రి వేళ ప్రయాణం, ప్రమాదాలపై ఆందోళన 
– నేటికీ నెరవేరని మండల చిరకాల వాంఛ
మండలంలో సంత ఏర్పాటు ఎవరికీ పట్టదా?
నవతెలంగాణ – పెద్దవంగర
పల్లె జీవనానికి ప్రతీకలు వారాంతపు సంతలు. వీటికి దశాబ్దాల చరిత్ర ఉంది. మనిషికి అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. ఇప్పటికీ ఎక్కువ మంది వారపు సంతల్లో వస్తువుల కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, దుస్తులు, ఆహార పదార్థాలు, సాగుకు అవసరమయ్యే సామగ్రి, పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు..ఇలా ఒకటేమిటి అన్నిరకాల వస్తువులు వారపు సంతల్లో దొరుకుతాయి. అటు రైతులు, ఇటు చిరు వ్యాపారులు, కొనుగోలుదారుల సమాహారమే వారపు సంత. బయట మార్కెట్‌ లో దొరకని చాలా వస్తువులు వారపు సంతల్లో దొరుకడం వల్ల సామాన్య ప్రజలు సంత లోనే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. స్థానికంగా రైతులు పండించిన కూరగాయలు, ఆహార ఉత్పత్తులు, పప్పు దినుసులతో పాటు కుటుంబ అవసరాలకు వినియోగించే దాదాపు అన్ని రకాల వస్తువుల క్రయ విక్రయాల కోసం ప్రజలు సంతకు వెళ్తున్నారు. అయితే పెద్దవంగర మండలానికి సంత ఏర్పాటు చిరకాల వాంఛ గానే మిగిలిపోయింది. మండలం ఆవిర్భవించి 8 సంవత్సరాలైన వారంతపు సంత లేక మండల వాసులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టి సారించి మండలంలో వారాంతపు సంత ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
నేటికీ నెరవేరని చిరకాల వాంఛ..
జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా పెద్దవంగర మండలం 2016 అక్టోబర్ లో నూతన మండలంగా ఆవిర్భవించింది. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలతో పాటుగా 10 తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. మండలంలో 27,823 వేల జనాభా నివసిస్తుంది. వీరిలో స్త్రీలు 13,920, పురుషులు 13,903 మంది ఉన్నారు. మండలంలో మొత్తం 8,596 నివాస గృహాలు ఉన్నాయి. 10,576 చదరపు కిలోమీటర్ల మండల విస్తీర్ణం కలదు. మండలం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా వారాంతపు సంత లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా మండలంలో రంగీ తండా, రామచంద్రు తండా, పోచారం, రెడ్డికుంట తండా, సర్పంచ్ తండా, కిష్టు తండా, కాండ్య తండా తదితరుల తండాల్లోని గిరిజనులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తున్నారు. మండలంలో ఏడాదికి 104 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. వీటితో పాటుగా సుమారు 1200 ఎకరాల్లో పండ్లతోటలు సాగుచేస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు అమ్మకాల కోసం ఇరత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సౌకర్యాలు ఉన్న కూడా మండలంలో సంత ఏర్పాటుకు ఎవరు పట్టించుకోవడం లేదు.
ఇతర జిల్లాలకు వెళ్తున్న మండల వాసులు..
మండలం ఏర్పడి సుదీర్ఘ కాలమైనా వారాంతపు సంత లేకపోవడంతో ప్రజలు మండల సరిహద్దుల్లోని సూర్యాపేట జిల్లా (జలాల్ పురం-ఆదివారం ) 10 కిలోమీటర్లు, (తిరుమలగిరి- బుధవారం) 22 కిలోమీటర్ల, జనగాం జిల్లా (కొడకండ్ల- గురువారం) 15 కిలోమీటర్ల, (పాలకుర్తి- సోమవారం) 30 కిలోమీటర్ల తో పాటుగా, స్వంత జిల్లా మహబూబాబాద్ (తొర్రూరు- మంగళవారం) 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంత లకు వెళ్తున్నారు. ఆయా సంతలు మండల కేంద్రం నుండి 10 కిలోమీటర్లు దూరం పైనే ఉండడం వల్ల మండల ప్రజలు సంతకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది ప్రజలు అధిక ధరలకు ఇంటి వద్దకు వచ్చే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మండల కేంద్రంలో వారాంతపు సంత ఏర్పాటు (శుక్రవారం) చేయడం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు పట్టించుకోవడం లేదు.
 సంత ఏర్పాటు కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంటి ముందుకు వచ్చే కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నాం. జలాల్ పురం సంత కు వెళ్లడానికి దూరాభారం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. పెద్దవంగరలో సంత ఏర్పాటు చేయాలి:  సాకి కరుణాకర్ (కొరిపల్లి)
సంత ఏర్పాటుకు చొరవ చూపాలి:
వారాంతపు సంతలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. పల్లె వాసులు కుటుంబ అవసరాలకు వారానికోసారి సరిపడా సరుకులను, కూరగాయలను తెచ్చుకునేందుకు వారాంతపు సంత లకు వెళ్తున్నాం. దగ్గర పట్ల సంత లేక ఇబ్బందులు పడుతున్నాం. మండల కేంద్రంలో సంత ఏర్పాటుకు అధికారులు, పాలకులు చొరవ చూపాలి: జాటోత్ గోపాల్ నాయక్ (సర్పంచ్ తండా)
భయపడుతూ కూరగాయలకు.. 
నేను తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. కుటుంబ అవసరాలకు వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు, సరుకుల కొనుగోలు కోసం సాయంత్రం వేళ బైక్ పై ప్రతి వారం సంతకు వెళ్తాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ సంతకు వెళ్లాల్సి వస్తుంది. మండల కేంద్రంలో సంత ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది: చిలుక సతీష్ (పెద్దవంగర)
కూరగాయలు అమ్ముకోవడానికి ఇబ్బందులు..
నాకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. పండించిన కూరగాయలను అమ్మడానికి దగ్గరలో సంత లేక ఇబ్బందులు పడుతున్నాం. తక్కువ ధరలకు తొర్రూరు, తిరుమలగిరి మార్కెట్ లో విక్రయించాల్సి వస్తుంది. పెద్దవంగరలో సంత ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా కూరగాయలు అమ్ముకుంటాం: జాటోత్ సునిత (రంగీ తండా)
పంట సమూహాల ఏర్పాటుకు తోడ్పాటు..
పంట సమూహాల ఏర్పాటుకు రైతులకు ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటునందిస్తుంది. మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తే, పంటల సమూహాల ద్వారా మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అధిక దిగుబడి తో పాటుగా, రైతులు సులభంగా కూరగాయలు అమ్ముకోవచ్చు:  రాకేష్ (ఉద్యాన శాఖ అధికారి-తొర్రూర్)