మేడిగడ్డపై ప్రభుత్వ ప్రకటన పట్ల హర్షం

– టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, సెంట్రల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్‌ నిపుణులతో రెండు మూడు రోజుల్లో ఒక కమిటీని వేసి చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించడం పట్ల కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ యుగంలో జరిగిన అతి పెద్ద దగా, మోసానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ దగా, మోసం కేసీఆర్‌ పర్యవేక్షణలో జరిగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు బయటపడి, మూడు నెలలు దాటినా సంబందిత ఇంజనీరింగ్‌ అధికారులు చిత్తశుద్ది లేకుండా, దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంజనీరింగ్‌ అధికారులు ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, కాంట్రాక్టర్ల అడుగులకు మడుగు లొత్తుతూ, వారి ప్రయోజనాలను కాపాడుతూ, యావత్‌ ప్రపంచంలో తెలంగాణను అభాసుపాలు చేసిందన్నారు.