– కేంద్రం వైఖరిపై ప్రధాని ప్రకటన చేయాలి
– అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్
– నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ అవినీతిపై చర్చించాలి. కేంద్రం వైఖరిని ప్రధాని మోడీ ప్రకటించాలి.. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి జెపి నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్, అనుప్రియా పటేల్ (అప్నాదళ్), సీపీఐ(ఎం) తరఫున ఎంపీ జాన్‌బ్రెట్టాస్, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగొరు, కె. సురేష్, జేడీయూ నేత ఉపేంద్ర కుష్వాహా, కె.ఆర్ సురేష్ రెడ్డి (బీఆర్‌ఎస్), లావు శ్రీకృష్ణదేవరాయులు (టీడీపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన), విజయ సాయిరెడ్డి, మిథున్ రెడ్డి (వైసీపీ), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), రాం గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), సంజరు సింగ్ (ఆప్), సంతోష్ కుమార్ (సీపీఐ), వైకో (ఎండిఎంకె), సస్మిత్ పాత్ర (బీజేడీ), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్‌ఎస్‌పీ) తదితరులు పాల్గొన్నారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, ఉత్తరప్రదేశ్‌లోని ఉప ఎన్నికల్లో అవకతవకలు, వక్ఫ్‌బిల్లుపై సభలో చర్చకు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అలాగే కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై కూడా చర్చించాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ మీడియాకు తెలిపారు. ప్రజా ప్రయోజనాల అంశాలపై చర్చ జరపాలని స్పష్టం చేశామన్నారు. అయితే అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. నవంబర్ 26న 75 ఏండ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ హాల్‌లో సంవిధాన్ సదన్ నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. మరోవైపు వక్ఫ్‌సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ నెల 29న తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించే అవకాశం ఉంది. అలాగే వక్ఫ్‌బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను ఆమోదించుకునేందుకు జాబితా చేసింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు తీసుకురావాలి :కెఆర్ సురేష్ రెడ్డి (బీఆర్‌ఎస్)
ప్రభుత్వం తెచ్చే 16 బిల్లులతో పాటు ”పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు”ను కూడా తీసుకురావాలని బీఆర్‌ఎస్ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అఖిల పక్ష సమాశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులే కాదు, ప్రయివేట్ మెంబర్ బిల్లులపై కూడా పార్లమెంట్ లో సమగ్రంగా చర్చ జరగాలని కోరారు. కోర్టులపై ఇప్పటికే కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని, పార్లమెంట్ పరిధిలోని అంశాలను కోర్టులకు తీసుకువెళ్లకుండా చట్టసభల్లోనే పరిష్కరించాలని కోరారు. ”వక్ఫ్ చట్ట సవరణ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. సమాజంలో విభజన, విభేదాలకు దారితీసే చర్యలను తాము సమర్థించమని పేర్కొన్నారు. విభజన చట్టం హామీలు పదేండ్లయినా పూర్తిగా అమలు కాలేదని, కాబట్టి ఇందులో సవరణలు చేస్తూ బిల్లు తీసుకురావాలని అన్నారు. సేకరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ”గిరిజన-ఆదివాసీ, దళితుల” భూములను సేకరిస్తోందని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటులో ప్రస్తావిస్తామని, చర్చకు పట్టుపడతామని అన్నారు.
లేటరల్ ఎంట్రీ ఉద్యోగాల భర్తీపై పార్లమెంటరీ కమిటీ
లేటరల్ ఎంట్రీతో ఉద్యోగాల భర్తీ సమస్యను పరిశీలించడానికి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కీలక పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో రాజకీయ దుమారం రేపిన అంశాన్ని పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది. లోక్‌సభ సెక్రెటేరియట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2024-25లో పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎంపిక చేసిన సబ్జెక్టులలో సివిల్ సర్వీసెస్‌లో లేటరల్ ఎంట్రీ ఒకటి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్‌సీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ మోడ్ ద్వారా భర్తీ చేయడానికి 45 పోస్టులను (10 జాయింట్ సెక్రెటరీలు, 35 డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రెటరీల) ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రతిపక్షాలతో పాటు లోక్ జనశక్తి పార్టీ (జేఎల్‌పీ), జేడీయూ వంటి ఎన్‌డీఏ మిత్రపక్షాల నుండి వ్యతిరేకత వ్యక్తం అయింది. సీపీఐ(ఎం)తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్‌జేడీ తేజస్వీ యాదవ్‌లతో సహా పలువురు నాయకులు షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టీ), ఓబీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. దీంతో ప్రభుత్వం తన ప్రకటనను రద్దు చేయాలని యూపీపీఎస్‌సీని కోరింది. బ్యూరోక్రాట్‌లు సాధారణంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ ద్వారా రిక్రూట్ చేయబడతారు. అయితే లేటరల్ ఎంట్రీ నియామకాలకు రిజర్వేషన్ కోటా వర్తించదు. ఇప్పటివరకు, 63 నియామకాలు లేటరల్ ఎంట్రీ ద్వారా జరిగాయి. వాటిలో 35 నియామకాలు ప్రయివేట్ రంగం నుంచి ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం 57 మంది అధికారులు మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో పదవుల్లో ఉన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2018లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు.