అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..

– ఉభయసభల్లో కొనసాగిన అనిశ్చితి
– అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన
– విప్లవ వీరులకు పార్లమెంట్‌ నివాళి
– లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాల ఆందోళన గురు వారం కూడా కొనసాగింది. పార్లమెంట్‌ ఆవరణంలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రతిపక్షాలు ధర్నా చేపట్టాయి. ప్లకార్డులు చేబూని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తాయి.
విప్లవవీరులను మరువలేం..
విప్లవవీరులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 92వ వర్థంతి సందర్భంగా పార్లమెంట్‌ ఘనంగా నివాళుర్పించింది. గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను గుర్తు చేసుకుంటూ ప్రకటన చేశారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో లేచి మౌనం పాటించి నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కూడా చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ అమరవీరులను త్యాగాలను గుర్తు చేస్తూ ప్రకటన చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులంతా నివాళుర్పించారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో నెలకొన్న అనిశ్చితి గురువారం కూడా కొనసాగింది. లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాలు ఆందోళనతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో కూడా అధికార, ప్రతిపక్షాల నినాదాల హౌరెత్తాయి. దీంతో సభ సాయంత్రం ఆరు గంటలకు వాయిదా పడింది. సప్లిమెంటరీ బిజినెస్‌లో ఆర్థిక బిల్లును జాబితా చేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. వెంటనే సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో సభ తొలుత మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.