వక్ఫ్‌ బిల్లుపై ఐదు రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన

– ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 1 వరకు చర్చలు
– సెప్టెంబర్‌ 28న హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీ ప్రతినిధులతో జేపీసీ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2024పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీి) సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 1 వరకు వివిధ వాటాదారులతో ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరపనుంది. ఈ సంప్రదింపులు దేశవ్యాప్తంగా 6,00,000 పైగా నమోదిత వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను నియంత్రించే వక్ఫ్‌ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులతో పాటు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, లాయర్స్‌ అసోసియేషన్లు, ముత్తవల్లి అసోసియేషన్లు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు.
దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా మొదట సెప్టెంబర్‌ 26న ముంబయిలో జేపీసీ పర్యటిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులతో సమావేశమవుతుంది. మహారాష్ట్ర రాష్ట్ర మైనారిటీ కమిషన్‌తో కూడా సమావేశం అవుతుంది. సెప్టెంబర్‌ 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించి గుజరాత్‌ ప్రభుత్వం, గుజరాత్‌ వక్ఫ్‌ బోర్డు, ఇతర కీలక వాటాదారులతో జేపీసీ సమావేశమవుతుంది.
సెప్టెంబరు 28న హైదరాబాద్‌లో జేపీసీ పర్యటిస్తుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వక్ఫ్‌ బోర్డులు, రెండు రాష్ట్రాల రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. గ్రాండ్‌ మక్కా మసీదు, వివిధ ధార్మిక సంస్థలతో సహా దేశంలోని కొన్ని ముఖ్యమైన వక్ఫ్‌ ఆస్తులకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. అలాగే, ఈ ఆస్తుల నిర్వహణ సంఘం సామాజిక, ఆర్థిక సంక్షేమంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌ వక్ఫ్‌ బోర్డు కూడా హైదరాబాద్‌ చర్చలలో పాల్గొంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన స్వరాల వైవిధ్యం దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలలో వక్ఫ్‌ ఆస్తులు ఎలా నిర్వహించబడుతున్నాయనే దానిపై సమగ్ర వీక్షణను అందించగలదని భావిస్తున్నారు.
అలాగే సెప్టెంబర్‌ 30న చెన్నైలో జేపీసీ సమావేశం నిర్వహించనుంది. ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు వక్ఫ్‌బోర్డు, రాష్ట్ర మైనారిటీ కమీషన్‌ ప్రతినిధులతో చర్చలు జరుగుతాయి. పార్లమెంటు సంయుక్త కమిటీ చివరి రోజు అక్టోబరు 1న బెంగళూరులో పర్యటిస్తుంది. ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక వక్ఫ్‌ బోర్డు, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. ఇక్కడ కేరళ వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు, ఇతర సంఘాల నేతలు కూడా చర్చల్లో పాల్గొంటారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల మొదటి వారం చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించాల్సి ఉంది.