హైదరాబాద్: కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. విజయానంద్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచుల్లో సాధికారిక విజయాలు నమోదు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, బిగ్ టీవీ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో బిగ్ టీవీ జట్టు వీజేడీ పద్ధతిలో 16 పరుగుల తేడాతో వీ6పై విజయం సాధించింది. బిగ్ టీవీ జట్టు తొలుత 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.. వీజేడీ పద్దతి ప్రకారం వీ6 లక్ష్యాన్ని 12 ఓవర్లలో 94 పరుగులుగా తేల్చారు. ఛేదనలో వీ6 జట్టు 9 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మూడు వికెట్లతో మెరిసిన ఎస్.సుధ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 42 పరుగులు తేడాతో జీ -కింగ్స్ జట్టుపై గెలుపొందింది. ఆంధ్రజ్యోతి నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ దిలీప్ (48), అబ్దుల్ షుకూర్ (29), రవి (31) రాణించారు. ఛేదనలో జీ కింగ్స్ 15 ఓవర్లలో 105/8 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన అబ్దుల్ షుకూర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.